రంగవల్లుల జాతర
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:37 AM
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ముగ్గుల పోటీల నిర్వహించారు.
పోటీపోటీగా సాగిన ముత్యాల ముగ్గుల పోటీలు
భారీగా తరలివచ్చిన నారీలోకం
కర్నూలు కల్చరల్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్‌సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్) ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ముగ్గుల పోటీల నిర్వహించారు. స్థానిక స్పాన్సర్లుగా టీజీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్, ఆయన తనయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సహకారంతో, మాంటిస్సోరి విద్యాసంస్థల డైరెక్టర్ కేఎన్‌వీ రాజశేఖర్ సౌజన్యంతో ఆదివారం ఉదయం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. 307 మంది మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులన్నీ ఇలను ముద్దాడుతున్న హరివిల్లుగా రూపుదిద్దుకుంది. తెల్లటి ముగ్గులు మధ్య మెరిసే గొబ్బొమ్మలు, వాటికి అలంకరించిన బంతిపూల సోయగాలు, గాలిపటాల రెపరెపలు, పల్లెపడుచుల ఆటలు, హరిదాసులు, గంగిరెద్దుల ఆటగాళ్లు, సంక్రాంతి పొంగళ్లను రంగవల్లుల మధ్యే వీక్షించేలా చేశారు.
సంప్రదాయంలో ముగ్గులు ఒక భాగం
ముగ్గులు మన సంప్రదాయంలో ఒక భాగమని, సంక్రాంతి పండుగ వేళ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మంచి సందర్భం అని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి, ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ అటు ప్రజా సమస్యలతో పాటు ప్రజల్లో భాగస్వామ్యం అయ్యేలా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ, రాష్ట్రస్థాయిలో మహిళలను ప్రోత్సహించడం ప్రశంసనీమని అన్నారు. పోటీల్లో గెలుపు ఓటముల కన్నా, మహిళలను పోటీల్లో భాగస్వామ్యం అవడం సంతోషదాయకమని అన్నారు.
- రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
‘మహిళలను ప్రోత్సహించడం అభినందనీయం’
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమని అతిథి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఆమె మాట్లాడుతూ మనకు ఎన్నో పండుగులు ఉన్నా సంక్రాంతి పెద్ద పండుగ అని, మూడురోజుల పాటూ జరిగే ఈ వేడుకలో ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంటుందని అన్నారు. ఒక పండుగ వాతావరణంలో మహిళలు పెద్ద సంఖ్యలో ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. డీఆర్వో వెంకటనారాయణమ్మ మాట్లాడుతూ మహిళలు వేసిన ముగ్గులన్నీ ఎంతో బావున్నాయని, అయితే బహుమతులు తమకు రాలేదన్న భావన కన్నా, పోటీల్లో పాల్గొన్నామనే సంతృప్తి ముఖ్యమని అన్నారు. సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విధంగా మహిళలకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం ముగ్గుల పోటీలు ఏటా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ముగ్గులు వేయడం ఒక కళఅని, అందులో సృజనాత్మకతతో వేయడం మహిళల ప్రత్యేకత అని అన్నారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల లక్ష్మణ్ మాట్లాడుతూ ఏటా నిర్వహిస్తున్న ఈ పోటీలకు మహిళలను నుంచీ గొప్ప ఆదరణ రావడం సంతోషమని, జిల్లా స్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో విశ్రాంత డీఎస్పీ మహబూబ్ బాషా, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్‌ఛార్జి చల్లా నవీన్‌కుమార్ నాయుడు, బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, ఏబీఎన్ ప్రతినిధి సుంకన్న, నంద్యాల స్టాఫ్ రిపోర్టర్ గోపాలకృష్ణ, న్యాయ నిర్ణేతలు డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి, టీవీ పద్మలత, సర్దార్ రాముడు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో విజేతలు వీరే...
కర్నూలులో ముగ్గుల పోటీల్లో ప్రథమ నగదు బహుమతి రూ.6 వేలు ఆర్. గౌతమి, ద్వితీయ నగదు బహుమతి రూ.4 వేలు శరణ్య, తృతీయ నగదు బహుమతి రూ.3 వేలు ఎం. రేణుక గెలుపొందారు. వీరికి ముఖ్య అతిథులు టీజీ వెంకటేశ్, గౌరు చరితతోపాటూ ఆహ్వాన అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఉత్తమంగా నిలిచిన 7గురు తెలుగు మహేశ్వరి, చంద్రకళ, వాణిబాయి, వి. సుజాత, ఎం. శైలజ, పి. రాజేశ్వరి, శ్రీలక్ష్మికి కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.
ఆదోనిలో..
ఆదోని/ఆదోని టౌన్/ఆదోని అగ్రికల్చర్(ఆంధ్రజ్యోతి) :కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని మిల్టన్ గ్రామర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ మైదానంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఎన్‌డీబీఎల్ పత్తి పరిశ్రమ అధినేత, ప్రముఖ్య పారిశ్రామికవేత్త బత్తిన లక్ష్మీనారాయణ, బత్తిన హనుమంతమ్మ కుటుంబ సభ్యులు స్పాన్సర్లుగా వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఆదోని డీఎస్పీ సోమన్న, అతిథులుగా బత్తిన లక్ష్మీనారాయణ, బత్తిన హనుమంతమ్మ, బత్తిన కుబేర్‌నాథ్, బత్తిన మల్లేశ్, మిల్టన్ గ్రామర్ హైస్కూల్ అధినేత రమేష్‌బాబు హాజరయ్యారు. ఈ పోటీల్లో 66 మంది మహిళలు, విద్యార్థినులు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా న్యాయవాది లలితా జితేంద్ర, జయప్రద, పరిమళ వ్యవహరించారు. మొదటి బహుమతి డి.గౌతమి రూ.6 వేలు, రెండో బహుమతి ఎ.రేణుక రూ.4 వేలు, మూడో బహుమతి బి.శిరీష రూ.3 వేలు గెలుచుకున్నారు. వారికి ముఖ్య అతిథి, అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు.