Share News

కైలాస వాహనంపై శివ పార్వతులు

ABN , Publish Date - Jan 14 , 2025 | 12:09 AM

కైలాస వాహనంపై శివ పార్వతులు

కైలాస వాహనంపై శివ పార్వతులు
శ్రీశైల క్షేత్రంలో కైలాస వాహనంపై విహరిస్తున్న స్వామి అమ్మవారులు

సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు

నేడు పార్వతీ కళ్యాణం

స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ

శ్రీశైలం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాసవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. లోకకల్యాణార్థం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, జపాలు, రుద్ర పారాయణాలు, చతుర్వేద పారాయణాలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాసవాహనంపై ఆశీనులను చేసి క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం ఎదుట కళాకారులు, డప్పు వాయిద్యాలు, కళాకారుల శంఖు, డమరుక నాదాలు, చెంచుల నృత్యాల సందడి భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఽఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.

సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు

భోగి పండుగను సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా సోమవారం భోగి వేడుకలను దేవస్థానం ఘనంగా నిర్వహించింది. వేకువజామున స్వామి, అమ్మవార్లకు ప్రాత:కాల పూజలయ్యాక ప్రధాన ఆలయం మహాద్వారం ఎదుట గంగాధర మండపం వద్ద భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. పిడకలు, ఎండుగడ్డి, వంట చెరుకుని వేసి భోగి మంటలను రాజేశారు.

సామూహిక భోగి పండ్ల కార్యక్రమం

భోగి పండుగను పురస్కరించుకొని ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులపై భోగిపండ్లు పోసి అర్చకస్వాములు, వేదపండితులు ఆశీర్వదించారు. దాదాపు 100 మందికిపైగా చిన్నారులకు భోగిపండ్లు పోసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నేడు శివ పార్వతుల కల్యాణం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. నందివాహనంపై ఆదిదంపతులను ఊరేగిస్తారు.

Updated Date - Jan 14 , 2025 | 12:09 AM