సావిత్రీబాయి పూలే సేవలు ఎనలేనివి
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:49 PM
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పూలే చేసిన సేవలు ఎనలేనివని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.
ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రీబాయి పూలే చేసిన సేవలు ఎనలేనివని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం కర్నూలు బీ.క్యాంపు బీసీ భవన్ ప్రాంగణంలో ఎంపీ నాగరాజు, బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సావిత్రీబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బానిసత్వం నుంచి మహిళల విముక్తి, విద్య కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రెసిడెన్షియల్ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో కురువ, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు కె.రామకృష్ణ, విజయకుమార్, శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు, నాగరాజు, పీజీ వెంకటేశ్, తెలుగు మహిళ నాయకురాలు పార్వతమ్మ, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.