దొంగ బంగారం
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:12 AM
బంగారాన్ని అక్రమ మార్గాల్లో విక్రయించేవారు పెరిగిపోయారు. కొందరు ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా జీరో వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖనాజాకు గండి కొడుతున్నారు.
జీరో వ్యాపారంతో ఖజానాకు గండి
నిఘా అధికారుల కళ్లకు గంతలు
దొరికితేనే దొంగలు.. లేదంటే దొరలే
బంగారాన్ని అక్రమ మార్గాల్లో విక్రయించేవారు పెరిగిపోయారు. కొందరు ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా జీరో వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఖనాజాకు గండి కొడుతున్నారు. కర్నూలు శివారులో పంచలింగాల చెక్‌పోస్టు దాటుకొని రూ.కోట్ల విలువైన బంగారం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలకు తరలిపోతోంది. దొరికితేనే దొంగలు.. లేదంటే దొరలే. కేరళ రాష్ట్రం ఎర్నాకులం నుంచి ఆదోని పట్టణానికి రూ.10 కోట్లకు పైగా విలువైన 13 కిలోల బంగారు ఓ రైలులో అక్రమ రవాణా చేస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బంగారం అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో బట్టబయలు చేసింది. ఈ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ పట్టణాల్లో బంగారు వ్యాపారం జరుగుతోంది. ఇందులో ముప్పాతిక వంతు ఆదోని, కర్నూలు నగరంలోనే జరుగుతోంది. ఆదోని పట్టణంలో 250 మంది, కర్నూలు నగరంలో 250-300 మంది వరకు బంగారులు వ్యాపారులు ఉన్నా.. ప్రభుత్వం నుంచి లైసెన్సులు లేకుండా వ్యాపారం చేస్తున్నవారే అధికం. ఉమ్మడి కర్నూలులో దాదాపుగా 850 మందికిపైగా బడా, చోటా వ్యాపారులు ఉన్నారని ఓ బంగారు వ్యాపారి తెలిపారు. ఒక్కో వ్యాపారి సగటున రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు బంగారు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ లెక్కన ఎంత తక్కువ కాదన్నా ఏడాదికి రూ.750 కోట్లకు పైగా బంగారు క్రయ విక్రయాల లావాదేవిలు జరుగుతున్నాయని అంటున్నారు. పాత బంగారం విక్రయించినా.. కొత్త బంగారం కొనుగోలు చేసినా తరుగు, మేకింగ్ చార్జీలు వసూలు చేస్తారు. లాభం సరేసరి. ఏటా రూ.కోట్ల లావాదేవీలు జరగుతుండడంతో జీఎస్టీ లెక్కలు చూపించలేక జీరో దందాకు తెర తీశారు. తద్వారా బంగారం అక్రమ రవాణా ఉధృతమైంది.
జోరుగా జీరో దందా..!
రత్నాలు, బంగారు ఆభరణాలు తయారీ, విక్రయాల రంగంలో దేశంలో సుమారుగా 50 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం. పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రం (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ మలోహత్రా గత ఏడాది జూలైలో జరిగిన ఓ సమావేశంలో వెల్లడించారు. ఈ రంగంపై ఆధారపడి ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో దాదాపుగా 4,500 నుంచి 5 వేల మందికిపైగా ఉపాధి పాందుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. అదే స్థాయిలో అక్రమ రవాణా, జీరో దందా కూడా సాగిస్తున్నారనే ఆరోపణులు ఉన్నాయి. ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోని పట్టణం, నగరాలకు ముడి బంగారు బిస్కెట్లు (24 క్యారెట్ల గోల్డ్ బార్) ఎలాంటి బిల్లులు, సుంకం చెల్లించకుండా అక్రమ రవాణా చేయడం ఒక ఎత్తు అయితే.. ఆభరణాలు తయారీ చేసి విక్రయించినప్పుడు బిల్లులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై రాసిస్తూ జీవో దందాకు పాల్పడటం ఇంకో ఎత్తు. తద్వారా జీఎస్టీ, ఆదాయ పన్ను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. బంగారు వ్యాపారి ఒక ఏడాదిలో చేసే వ్యాపారంలో 30-40 శాతానికి మించి జీఎస్టీ లెక్కలు చూపడం లేదని ఓ వ్యాపారి పేర్కొనడం కొసమెరుపు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి ఏడాదిలో రూ.15-20 కోట్లకు పైగా జీఎస్టీ రూపంలో ఎగనామం పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో బంగారు క్రయ విక్రయాలపై ఒక శాతం జీఎస్టీ ఉంటే.. ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ వసులు చేస్తున్నారు. జీఎస్టీ పెంచడం కూడా అక్రమ వ్యాపారానికి ఓ కారణమని వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. అక్రమ రవాణాను, జీరో వ్యాపారాన్ని అరికట్టి ప్రభుత్వ ఖజానా రాబడి పెంచాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణులు ఉన్నాయి.
ఆదోని అడ్డాగా బంగారు అక్రమ రవాణా!
ఆదోని పట్టణం వ్యాపార, వాణిజ్య రంగంలో రెండో ముంబాయిగా ప్రసిద్ధి చెందింది. అదే స్థాయిలో బంగారు అక్రమ రవాణా అడ్డాగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. కేరళ రాష్ట్రం ఎర్నాకులం పట్టణం నుంచి ఆదోనికి చెందిన 12 మంది బంగారు వ్యాపారులు 13 కిలోల బంగారం (విలువ రూ.10 కోట్లు పైమాటే) అక్రమంగా కన్యాకుమారి - పూణే ఎక్స్‌ప్రెస్ రైలులో రవాణా చేస్తుండగా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ సూపరింటెండెంట్ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బంది దాడులు చేసి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పట్టుబడిన వ్యాపారుల్లో పట్టణంలో ఓ ప్రముఖ బంగారు వ్యాపారి కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై మాసంలో చెన్నై నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా రెండు కిలోలు (విలువ రూ.1.50 కోట్లు పైమాటే) బంగారం సీజ్ చేసి.. ఆ తరువాత మామూళ్లు పుచ్చుకొని వదిలేశారనే ఆరోపణులు ఉన్నాయి. గతంలో కూడా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి.. తరువాత రాజకీయ నేతల జోక్యం, వారి అండదండలతో కేసులు లేకుండా బయటపడిన సంఘటనలు ఉన్నాయి. ఆదోనిలో ఒక్కటే కాదు.. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో కూడా బంగారు జీరో వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణులు ఉన్నాయి.
బంగారం అక్రమ రవాణా సంఘటనలు కొన్ని..
2017 సెప్టెంబరులో కర్నూలు నగర శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 16 కిలోల బంగారు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఇన్నోవా కారులో ఈ బంగారం తరలిస్తుండగా పట్టుబడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరిలిస్తున్నట్లు నాడు పోలీసులు గుర్తించారు.
2021 మార్చి నెలలో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి అక్రమంగా 14.8 కిలోలు బంగారం రవాణా చేస్తుండగా కర్నూలు నగర శివారులో పంచలింగాల చెక్ పోస్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన రికార్డులు చూపకపోవడంతో బంగారు సీజ్ చేశారు.
2021లో కర్నూలు నగరంలోని ఓ బంగారు దుకాణంలో పని చేస్తున్న వ్యక్తి హైదరాబాదు నుంచి కర్నూలుకు ఓ ప్రైవేటు బస్సులో తీసుకొస్తుండగా పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తున్న అప్పటి సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య 1.818 కిలోల బంగారు సీజ్ చేశారు. విలువ రూ.1.80 కోట్లు ఉంటుందని అంచనా. ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
2021 జూన్ 24న మాసంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో 5 కిలోల బంగారం ఎలాంటి రికార్డులు లేకుండా రవాణా చేస్తున్నారు. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేసిన సెబ్ పోలీసులు సీజ్ చేశారు. బంగారు నగల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.
అదే ఏడాది జూన్ 11న కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ కారును సెబ్ పోలీసులు తనిఖీ చేయగా.. 7 కిలోలు బంగారు రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి బిల్లులు చూపకపోవడంతో సీజ్ చేశారు.
2024 ఫిబ్రవరి 2న కృష్ణగిరి మండలం అమకతాడు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు స్పెషల్ బ్రాంచి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.59 కోట్ల విలువైన బంగారు, వెండి సహా నగదు సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో నంద్యాలకు చెందిన వ్యక్తి ఉన్నాడు.
2020 మార్చి నుంచి 2021 జూన్ వరకు పంచలింగాల చెక్‌పోస్టు అప్పటి సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య రెండేళ్లలో వాహన తనిఖీలు, దాడుల్లో బిల్లులు, ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమ రవాణా చేస్తున్న దాదాపు 26 కిలోలు బంగారం, 450 కిలోలకు పైగా వెండి సీజ్ చేసినట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తుంది. తరువాత ఆ స్థాయిలో అక్రమ బంగారం, వెండి రవాణాపై తనిఖీలు, దాడులు, నిఘా కొరవడిందనే ఆరోపణులు ఉన్నాయి.