వాళ్లవి బెదిరింపు రాజకీయాలు
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:13 AM
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఆరోపించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ
డోన్ రూరల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఆరోపించారు. పట్టణంలోని పాతబస్టాండు రైల్వేస్టేషన్ రోడ్డులో మంగళవారం సాయంత్రం సీపీఐ నూరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు కొత్తబస్టాండు ప్రధాన రోడ్డు నుంచి పాతబస్టాండు వరకు సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు హాజరైన వారిని ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటులో ఇటీవల భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించకపోవడం దారుణమన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కరెంటు చార్జీలు పెంచిందన్నారు. ఆదానితో విద్యుత్ ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల విద్యుత్ భారాన్ని సీఎం చంద్రబాబు వేస్తున్నారని అన్నారు. ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, సుంకయ్య, మోట రాముడు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు నారాయణ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్ విగ్రహావిష్కరణ
పట్టణంలోని గుత్తి రోడ్డులోని అమ్మా హోటల్ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మ హోటల్ సర్కిల్‌లో భగత్‌సింగ్ సర్కిల్‌గా నామకరణం చేయాలని ఆయన మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.