Share News

చంద్రబాబుతోనే ముస్లింల సంక్షేమం

ABN , Publish Date - Jan 01 , 2025 | 12:14 AM

సీఎం చంద్రబాబు హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

చంద్రబాబుతోనే ముస్లింల సంక్షేమం
మాట్లాడుతున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

ఆత్మకూరులో జరిగే తబ్లీగ్‌ ఇస్తేమాకు రూ.2 కోట్లు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌

ఆత్మకూరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణ శివార్లలోని శ్రీశైలం రస్తాలో జనవరి 7,8,9 తేదీల్లో జరగబోవు తబ్లీగ్‌ ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్‌ రాజకుమారితో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో జరిగే ఇస్తేమా కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది ముస్లింలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఏలోటు రానివ్వకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2019లో కర్నూలులో జరిగిన అంతర్జాతీయ ఇస్తేమాకు అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.10కోట్ల నిధులను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇటీవల మసీదు, చర్చీల్లో పనిచేసే ఇమామ్‌, మోజన్‌, పాస్టర్లకు కూడా గౌరవ వేతనాలు అందించినట్లు వివరించారు. ముస్లింల సంక్షేమానికి కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించినట్లు చెప్పారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరులో భారీ ఇస్తేమా జరగడం విషయమని అన్నారు. ఇస్తేమా ఏర్పాట్లలో ప్రణాళికబద్ధంగా వ్యవహరించి విజయవంతం చేయాలని అధికారులను సూచించారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. ఇస్తేమా ఏర్పాట్ల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్‌, ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, డీఎస్పీ రామాంజీనాయక్‌, తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీవో సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 12:15 AM