AP Ministers: ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్నింటా స్కాములే!
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:28 AM
‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్... ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతే. వైసీపీ నేతలు చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు చేయిస్తాం.

గత ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ చేయిస్తాం
శాసన మండలిలో మంత్రులు అనగాని, కొల్లు
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్... ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతే. వైసీపీ నేతలు చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు చేయిస్తాం. అవినీతిని నిగ్గు తేలుస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర సోమవారం శాసన మండలిలో ప్రకటించారు. వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై మండలిలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి అనగాని సమాధానమిచ్చారు. ‘సీఎం జగన్ రెడ్డి రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. పురాణాల్లో ఒక్క బకాసురుడే ఉండేవాడు. కానీ జగన్‌రెడ్డి పాలనలో ఊరికి ఒకరిద్దరు భూబకాసురులు తయారయ్యారు. వీరి ఆకలికి ప్రభుత్వ భూములు సరిపోలేదు. అటవీ భూములు ఆగలేదు. ప్రవాసాంధ్రుల భూములు పత్తాలేకుండా పోయాయి. చివరికి పేదల భూములను కూడా వదల్లేదు. చిత్తూరు జిల్లాలో వైసీపీలో పెద్ద నాయకుడు అటవీ భూములను కబ్జా చేశాడు. అటవీ భూముల్లో 104 ఎకరాలను కబ్జా చేసి విలాసవంతమైన భవంతి నిర్మించుకున్నారు. వారి బినామీల చెరలో దాదాపు 238 ఎకరాలు ఉన్నట్లు తేలింది. తిరుపతి నడిబొడ్డున రూ.100 కోట్లకుపైగా విలువైన బుగ్గమఠం భూముల్ని ఆక్రమించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో 982 ఎకరాల ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చేశారు.
ఇందులో 600 ఎకరాలను పెద్ద నేత అనుచరులు రాయించుకున్నారు. ఆ గుట్టు బయటపడుతుందని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను తగులబెట్టించారు. 55 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములను ఓ ప్రభుత్వ సలహాదారు ఆక్రమించారు. కడప జిల్లాలో జగన్‌రెడ్డి బంధువులు యానాదులకు చెందిన 470 ఎకరాలను రాయించుకున్నారు. విశాఖలో జగన్‌రెడ్డి అండతో రెచ్చిపోయిన విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించేశారు. విశాఖపట్నంలో 8 వేల కోట్ల పైచిలుకు భూములు కబ్జాకు గురయ్యాయి. వైసీపీ నేతలు చేసిన ప్రతి స్కాంపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి చెప్పారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గనులు, ఎక్సైజ్ శాఖలో జరిగిన కుంభకోణాలపైనా విచారణ చేయిస్తామని చెప్పారు.