Revenue Department : రిటైర్డ్ తహశీల్దార్ పేరుతో 400 ఎకరాలు!
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:23 AM
ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములు ఉంటే వేర్వేరు ఖాతా నంబర్లు వస్తాయి. నోషనల్ ఖాతా నంబరు లో అంకెలు ఎక్కువ ఉంటాయి.

అందులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు
ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రం.. 4 నెలల క్రితం ఆయన కన్నుమూత
ఆ భూముల్లో కొన్నిటికి గత నెలలో ఇతరుల పేరిట మ్యుటేషన్లు
ఎలా జరిగిందో, ఎవరు చేయించుకున్నారో అంతుబట్టని వైనం
ఇందులో మోసం లేదంటున్న రెవెన్యూ అధికారులు
హక్కుదార్లు తెలియకే తహశీల్దార్ ఖాతా నంబరంటూ సమర్థన
పెందుర్తి మండలంలో ఒకే ఖాతా నంబర్‌పై నమోదు
ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో చిత్ర విచిత్రాలు వెలుగుచూస్తున్నాయి. ఓ మండలంలో పనిచేసిన తహశీల్దార్ పేరిట వందల ఎకరాలు నమోదై ఉన్నాయి. ఆయన 4 నెలల క్రితం మరణించారు. అయితే గత నెలలో ఆయన పేరిట ఉన్న కొన్ని భూములకు ఇతరుల పేర్ల మీద మ్యుటేషన్ జరిగింది. ఇలా ఎలా జరిగిందో అంతుచిక్కడం లేదు.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఏదైనా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు అందుబాటులో లేకపోయినా, అనుమానం ఉన్నా వాటిని నోషనల్ ఖాతాలో నమోదు చేస్తారు. భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ రెవెన్యూ శాఖ ఒక ఖాతా నంబరు ఇస్తుంది. ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములు ఉంటే వేర్వేరు ఖాతా నంబర్లు వస్తాయి. నోషనల్ ఖాతా నంబరు లో అంకెలు ఎక్కువ ఉంటాయి. చూడగానే తెలిసిపోతుంది. అయితే విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ తహశీల్దార్ లాలం సుధాకర్‌నాయుడికి చెందిన ‘ఖాతా నంబరు 9102’ మీద సుమారు 400 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. పెందుర్తి, చినముషిడివాడ, గుర్రంపాలెం, ముదపాక, గొరపల్లి, పొర్లుపాలెం, పినగాడి, పెదగాడి, నరవ, పులగాలపాలెం, రాజయ్యపేట, సరిపల్లె, సౌభాగ్యపురం గ్రామాల్లో వివిధ సర్వే నంబర్లలో ఇవి ఉన్నాయి. ‘మీ భూమి’లో చూస్తే ప్రతి గ్రామంలో ఆ ఖాతా నంబరు (9102) మీద ఆయన పేరుతోనే భూములు కనిపిస్తున్నాయి. కొన్ని అనువంశికంగా వచ్చాయని, కొన్ని బహుమానంగా వచ్చాయని, కొన్ని కొనుగోలు చేశారని రికార్డులు చూపిస్తున్నాయి.
ఈ ఖాతా ఆయన ఆధార్ నంబరుకు లింకై ఉండడం గమనార్హం. పెందుర్తి సహా అనేక మండలాల్లో తహశీల్దార్‌గా పనిచేసిన సుధాకర్‌నాయుడు గత అక్టోబరు 17న చనిపోయారు. ఆయన పేరిట ఉన్న కొన్ని భూములకు సంబంధించి గతనెల 2న ఇతరుల పేర్లపై మ్యుటేషన్లు జరిగాయి. ఆ వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా.. ఎవరు చేయించుకున్నారనేది లేదు. అవన్నీ మండల కార్యాలయం రికార్డుల్లోనే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి పేరిట ఎవరు దరఖాస్తు చేశారనేది ఇక్కడ ముఖ్యం. పులగాలపాలెం సర్వే నం.128లో 3.14 ఎకరాలు, 146-4లో 1.62 ఎకరాలు.. ఇలా సుమారు 10 ఎకరాల వరకు చేతులు మారాయి. వీటి విలువ సుమారు రూ.100కోట్లు ఉంటుంది. ఈ అంశాన్ని రెవెన్యూ అధికారుల వద్ద ప్రస్తావించగా.. హక్కుదారులెవరో తెలియకపోవడం వల్ల అప్పటి తహశీల్దార్ సుధాకర్‌నాయుడి ఖాతా నంబరు నమోదు చేసి ఉంటారని, అందులో మోసం ఏమీ ఉండదని సమర్థించుకున్నారు. సాధారణంగా ఇలాంటి భూములను నోషనల్ ఖాతాలో నమోదు చేస్తారు. ఇక్కడ సుధాకర్‌నాయుడికి ఒకటే ఖాతా ఉంది. పొరపాటున ఆయన పేరు నమోదు చేసి ఉంటే.. ఆయన చనిపోయిన తర్వాత వాటిని ఇతర ఖాతాలకు మళ్లించాల్సి ఉంది. రీసర్వే జరిగినప్పుడైనా ఈ తప్పులు సరిదిద్దాల్సి ఉంది.
సరిచేసే ప్రయత్నమేదీ?
రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని కొందరు సమాచార హక్కు చట్టం కార్యకర్తలు పెందుర్తి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సుధాకర్‌నాయుడి పేరిట వందల ఎకరాల భూములు ఉన్నాయనే విషయం వారిదృష్టికి వచ్చింది. దానిపై స్థానిక అధికారులను ప్రశ్నించారు. అక్కడ సరైన స్పందన లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారులను కలిశారు. వారూ తప్పు జరిగిందని అంటున్నారే తప్ప దానిని సరిచేసే ప్రయత్నం చేయడం లేదు. ఈ విషయమై పెందుర్తి తహశీల్దార్ ఆనందకుమార్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా.. ఆయన నుంచి స్పందన లేదు.