P4 program Andhra Pradesh:పేదరికంపై పీ4 అస్త్రం
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:51 AM
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 20 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి

పేదలకు, సంపన్నులకు వారధిగా కార్యక్రమం రూపకల్పన
అట్టడుగునున్న వారికి చేయూత ఇచ్చే వేదిక
ఎన్నారైలు సహా ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు
రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలనే కార్యక్రమం లక్ష్యం
దాతలకు ‘మార్గదర్శి’గా, లబ్ధిదారులకు ‘బంగారు కుటుంబం’గా నామకరణం
మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి
సమీక్షలో సీఎం.. ఉగాదికి అమరావతిలో ప్రారంభం
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు వినూత్నంగా పీ4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పేదలకు సంపన్నులు సహాయం చేసేందుకు, తద్వారా పేదరికం లేని సమాజం నిర్మించేందుకు వీలుగా ఆ కార్యక్రమం కింద ఓ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని వెల్లడించారు. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. 2029 కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పీ4 కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభిస్తున్న నేపథ్యంలో, సోమవారం సచివాలయంలో ఆ కార్యక్రమం నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించి ఆమోదం తెలిపారు. ఎన్నారైలు సహా పేదలకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎవరిపైనా ఒత్తిడి చేయవద్దని అధికారులకు సూచించారు. దాతలను, లబ్ధిదారులను ఓ వేదికపైకి తీసుకురావడం వరకే ప్రభుత్వ పాత్ర పరిమితం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనంగా ఆర్థిక సాయం అందబోదని వెల్లడించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిపొందే పేద కుటుంబాలను ‘‘బంగారు కుటుంబం’’గా, సాయం చేసే సంపన్న కుటుంబాలను ‘‘మార్గదర్శి’’గా పిలవాలని సీఎం సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో తప్పులు లేకుండా చూడాలని, తద్వారా సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిలో స్ఫూర్తిని నింపాలని సూచించారు. వివాదాలకు తావులేకుండా, పారదర్శకంగా గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారుల తుదిజాబితాను రూపొందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, పీ4 పథకానికి ఎలాంటి సంబంధం ఉండదని, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి చేయూత అందించడమే పీ4 ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలు గందరగోళానికి గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతిగ్రామం నుంచి ఒక్కరైనా హాజరయ్యేలా చూడాలని, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం తెలిపారు.
For AndhraPradesh News And Telugu News