Public Event : 15-20 తేదీల మధ్య అమరావతికి ప్రధాని?
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:17 AM
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు.

250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ
వెలగపూడి సచివాలయం వెనుక ఎన్-9 రోడ్డు సమీపాన ఏర్పాటు
రాజధానికి మోదీ వరాలిస్తారని రైతుల్లో ఆశలు
మంగళగిరి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు. సుమారు రూ.42 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రావాలని సీఎం చంద్రబాబు ఆయన్ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) వర్గాలు ఆమోదించినప్పటికీ.. నిర్దిష్టమైన తేదీని ఖరారు చేయలేదు. అయితే ఏప్రిల్ 15-20 తేదీల నడుమ ఏదో ఒక రోజు ఆయన వస్తారని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అధికారిక షెడ్యూల్ విడుదల కానప్పటికీ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయానికి వెనుకవైపు ఎన్-9 రోడ్డుకు పశ్చిమంగా ఉన్న ప్రాంతాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సదరు ప్రాంగణాన్ని ఆదివారం నుంచి చదును చేయడం మొదలుపెట్టారు.
సుమారు 16 పొక్లయిన్లు, 4 భారీ క్రేన్లు, 6 ట్రక్కులతో పనులు పెద్దఎత్తున మొదలుపెట్టారు. ఈ నెల 30వ తేదీన ఈ ప్రాంతంలోనే 30-40 ఎకరాల్లో ఉగాది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని సభను కూడా ఇక్కడే ఏర్పాట్లు చేసే ఉద్దేశంతో విస్తీర్ణాన్ని 250 ఎకరాలకు పెంచి ఇప్పటి నుంచే సంబంధిత పనులు మొదలుపెట్టారు. ఇంకోవైపు.. తమకు మేలు చేకూర్చే విధంగా రాజధానిపై ప్రధాని మరిన్ని వరాలు ప్రకటిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.