మళ్లీ ఎయి‘డెడ్’
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:57 AM
జిల్లాలో 17 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూసివేత గండం పొంచి ఉంది. 40మంది లోపు విద్యార్థులు ఉండటంతో ఆ స్కూళ్లకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్ సంజాయిషీ నోటీసులు జారీచేశారు. యూడైస్ 2024 ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో 40మంది లోపు విద్యార్థులు ఉంటే వాటికి నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలను ఆదేశించారు.
17 పాఠశాలలపై వేటుకు రంగం సిద్ధం
డీఈవో షోకాజ్ నోటీసులు
15 రోజుల్లో సంజాయిషీకి ఆదేశం
ఒంగోలు విద్య, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 17 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూసివేత గండం పొంచి ఉంది. 40మంది లోపు విద్యార్థులు ఉండటంతో ఆ స్కూళ్లకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్ సంజాయిషీ నోటీసులు జారీచేశారు. యూడైస్ 2024 ప్రకారం ఎయిడెడ్ పాఠశాలల్లో 40మంది లోపు విద్యార్థులు ఉంటే వాటికి నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ డీఈవోలను ఆదేశించారు. యూడైస్ ప్రకారం తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల జాబితాలను కూడా డైరెక్టర్ పంపారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో అక్కడ పనిచేస్తున్న టీచర్లు మిగులుగా తేలుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అయితే ఆ పాఠశాలల్లో అదనంగా పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయా యాజమాన్యాలకు గతంలో చెప్పినా పట్టించుకోని పరిస్థితి. దీంతో ఈ స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీచేశారు. మీ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు, ఆర్థిక సాయం (గ్రాంటు) ఎందుకు నిలిపివేయరాదో తెలియజేయాలని ఆ నోటీసుల్లో డీఈవో పేర్కొన్నారు. 15 రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వకపోతే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ఆ ఉత్తర్వుల్లో డీఈవో పేర్కొన్నారు.
నోటీసులు జారీ చేసిన పాఠశాలలు ఇవే..
జిల్లాలో వివిధ మండలాల్లో పనిచేస్తున్న 17 పాఠశాలలకు డీఈవో నోటీసులు ఇచ్చారు. బేస్తవారపేట అమెరికన్ బాప్ట్ మిషన్ పాఠశాల, దర్శి కృష్ణాపురం ఎయిడెడ్ పాఠశాల, దొనకొండ మండలం బాదాపురం ఎయిడెడ్, హనుమంతునిపాడు ఎస్‌పీఆర్‌ఎంసీ, హెచ్‌ఎంపాడు మండలం వెంకటరెడ్డిపల్లి వీసీఏ, కొమరోలు మండలం గోపానిపల్లి ఏబీఎం పాఠశాలలు, కొమరోలు మండలం ఎస్‌ఆర్‌పల్లి ఎస్‌బీఎన్‌ఆర్‌ఎంఎ ప్రాథమిక పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మార్కాపురం మండలం బోడపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, మార్కాపురం ఒకటో వార్డులోని అజాద్ మెమోరియల్, నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, పోతవరం ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, ఒంగోలు మండలం కొప్పోలు ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, కొప్పోలు ఏయూపీఎన్‌పీఆర్ ఎయిడెడ్ స్కూలు, పుల్లలచెరువు మండలం మానేపల్లిలోని ఉమామహేశ్వర ఎయిడెడ్ యూపీ స్కూలు, మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి ఎయిడెడ్ పాఠశాల, పోతవరం పీవీఎస్ ఎయిడెడ్ పాఠశాల, ఒంగోలు ఎస్‌హెచ్‌ఎస్ కాంపౌండ్‌లోని ఏబీఎం స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. ఈ పాఠశాలలపై తదుపరి చర్యలు చేపట్టాలని ఆయా మండలాల మండల విద్యాధికారులను డీఈవో ఆదేశించారు.