ఆనందరసభరితం.. అన్నమయ్య సంకీర్తనం
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:50 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నాగసత్య లత దంపతులు డిజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన ప్రముఖ గాయని, ఆధ్యాత్మిక గురువు కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య సంకీర్తనా విభావరి ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచింది.
అలరించిన కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య సంగీత విభావరి
హాజరైన పలువురు ప్రముఖులు
భారీగా తరలివచ్చిన ప్రజలు
ఒంగోలు కల్చరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నాగసత్య లత దంపతులు డిజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటుచేసిన ప్రముఖ గాయని, ఆధ్యాత్మిక గురువు కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య సంకీర్తనా విభావరి ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచింది. మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ ఆధ్యాత్మిక పథంలో పయనించటం ద్వారా సమాజంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని, అటువంటి వాటికి అన్నమయ్య సంకీర్తనల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన శాసనసభ్యులు దామచర్ల దంపతులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం వేలాదిమంది ప్రేక్షకులతో నిండిపోయింది. అనంతరం కొండవీటి జ్యోతిర్మయి ముందుగా అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను వివరించి అనంతరం పలు సంకీర్తనలను రసరమ్యభరితంగా గానం చేశారు. ప్రజలు వేలాదిగా తరలిరావటంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.