బంధాలు తెగిపోతున్నాయ్!
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:04 PM
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల బంధంపై అనుమానం కత్తి దూస్తోంది. వివాహేతర సంబంధాలు హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆధునిక యుగంలోనూ కుల, మతాంతర వివాహాలను జీర్ణించుకోలేని కొందరు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడం లేదు. ఆదివారం జిల్లాలో వెలుగు చూసిన పలు ఉదంతాలు ఇందుకు దర్పణం పడుతున్నాయి.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
ఇల్లాలిని చంపేందుకు సొంత తమ్ముళ్లతో కలిసి భర్త ప్రయత్నం
పోలీసుల విచారణలతో బయటపడిన నిజం
అల్లుడిని చంపేందుకు మామ సుపారీ
కుమార్తెను మతాంతర వివాహం చేసుకోవడమే కారణం
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల బంధంపై అనుమానం కత్తి దూస్తోంది. వివాహేతర సంబంధాలు హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆధునిక యుగంలోనూ కుల, మతాంతర వివాహాలను జీర్ణించుకోలేని కొందరు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడం లేదు. ఆదివారం జిల్లాలో వెలుగు చూసిన పలు ఉదంతాలు ఇందుకు దర్పణం పడుతున్నాయి. కంభంలో అనుమానంతో భార్యను తలపై కర్రతో కొట్టి హతమార్చాడో కసాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నదన్న అనుమానం ఒకవైపు, ఆస్తి విషయంలో అడ్డుపడుతున్నదన్న కోపం మరోవైపు.. కట్టుకున్న భార్యను తన సోదరుల సాయంతో లారీతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడో భర్త. ఈ ప్రమాదంలో ఆమె తప్పించుకోగా వరుసకు మనుమరాలు అయ్యే బాలిక మృతి చెందింది. నిందితుల్లో ఇద్దరిని మార్కాపురం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కుమార్తె మతాంతర వివాహం చేసుకుందని అల్లుడి హత్యకు ఓ మామ పథకం పన్నాడు. రౌడీషీటర్‌తో సుపారీ కుదుర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న దాదావలి కుమార్తె ఫిర్యాదు చేయడంతో విచారణచేపట్టిన పోలీసులు రౌడీ షీటర్‌ను అరెస్టు చేశారు.
అనుమానంతో చంపబోయారు.. మరొకరు బలయ్యారు..
హత్య కేసును ఛేదించిన పోలీసులు
వివరాలను వెల్లడించిన డీఎస్పీ
మార్కాపురం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): అక్రమ సంబంధాలు పెట్టుకోవడమేకాక ఆస్తి విషయంలో ఇబ్బందులు పెడుతున్న భార్యను కడతేర్చాలని యోచించాడు. టిప్పర్‌తో ఢీకొట్టి చంపాలని పథకం వేశాడు. కానీ చివరికి అమాయకురాలు బలైంది. మండలంలోని కోమటికుంట సమీపంలో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులలో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్‌డీపీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మార్కాపురం డీఎస్పీ డాక్టర్ యు.నాగరాజు వివరాలు వెల్లడించారు. మండలంలోని కె.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈర్నపాటి పెద్దవెంకటేశ్వర్లుకు అదే గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో సుబ్బలక్ష్మమ్మకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో పెద్దవెంకటేశ్వర్లు తమ్ముడు చిన్నవెంకటేశ్వర్లుతోపాటు మరో ఇద్దరితో కలిసి 2005లో సదరు వ్యక్తిని గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఈ కేసులో ఇద్దరు అన్నదమ్ములు 14 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించి 2019లో విడుదలయ్యారు. అప్పట్నుంటి పెద్దవెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మలు దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో సుబ్బలక్ష్మమ్మ పలుమార్లు భర్తతో ఆస్తి విషయంలో గొడవపడింది. అంతేకాక మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వీటన్నింటిని మనసులో పెట్టుకున్న అన్నదమ్ములు పెద్దవెంకటేశ్వర్లు, వెంకటరమణ, చిన్నవెంకటేశ్వర్లు ఎలాగైనా సుబ్బలక్ష్మమ్మను మట్టుపెట్టాలని పథకం రచించారు. వెంకటరమణకు చెందిన టిప్పర్‌ను ఉపయోగించి చిన్నవెంకటేశ్వర్లు ఈ నెల 9న కే కొత్తపల్లి - మార్కాపురం మధ్యలో మాటువేసి ఉన్నారు. ఈ సమయంలో కె.కొత్తపల్లి గ్రామం నుంచి స్కూటీపై వరుసకు మనువరాలయ్యే ఏడుమల్ల రాధాతో సుబ్బలక్ష్మమ్మ మార్కాపురం వస్తోంది. దీంతో టిప్పర్‌తో స్కూటీని చిన్నవెంకటేశ్వర్లు వెంబడించాడు. సుమారు కోమటికుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో చిన్నవెంకటేశ్వర్లు టిప్పర్‌తో సుబ్బలక్ష్మమ్మ స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై నుంచి రాధ ఒక్క ఉదుటున రోడ్డుపై పడి మృతిచెందింది. సుబ్బలక్ష్మమ్మ గాయాలతో బయటపడినట్లు గ్రహించిన చిన్నవెంకటేశ్వర్లు టిప్పర్ దిగివచ్చి కర్రతో మళ్లీ దాడి చేశాడు. అటుగా వాహనాలపై వెళ్తున్న వాళ్లు ఆగి కేకలు వేయడంతో చిన్నవెంకటేశ్వర్లు టిప్పర్‌తో పరారయ్యాడు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావుల పర్యవేక్షణలో నిందితుల కోసం గాలించారు. ఆదివారం మధ్యాహ్నం పట్టణంలో ఉన్న టిప్పర్ యజమాని వెంకటరమణ, చిన్నవెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సుబ్బలక్ష్మమ్మ భర్త పెద్దవెంకటేశ్వర్లు పరారీలో ఉన్నాడు.
అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ
రూ.3 లక్షల రౌడీషీటర్‌తో ఒప్పందం.. నిందితుడు అరెస్టు
పెద్దారవీడు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకొన్న తండ్రి అల్లుడిని అంతమొందించేందుకు పన్నాడు. అందుకుగాను ఓ రౌడీషీటర్‌ను ఎంచుకున్నాడు. అల్లుడిని హత్య చేసేందుకు సదరు రౌడీషీటర్‌కు రూ.3 లక్షల సుపారీ కూడా చెల్లించాడు. చివరకు విషయం తన కుమార్తెకు తెలియడంతో రౌడీషీటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం, మార్కాపురం మండలం నికరంపల్లికి చెందిన దూదేకుల దాదావలి కుమార్తె ఖాసింబి అదే గ్రామానికి చెందిన బత్తుల అంకయ్యను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి అంకయ్యపై దాదావలి కక్ష పెంచుకున్నాడు. దాదావలి పదిరోజుల క్రితం గతంలో హత్య కేసులో నిందితుడైన బట్టగిరి రాఘవేంద్రరెడ్డిని కలిశాడు. అంకయ్యను అంతమొందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకుగాను రూ.3 లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు. ఈ హత్యాపథకం గురించి సమాచారం తెలుసుకున్న నికరంపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు గోగిరెడ్డి సుబ్బారెడ్డి విషయాన్ని దాదావలి కుమార్తె ఖాసింబికీ తెలియజేశాడు. దీంతో ఖాసింబీ బట్టగిరి రాఘవేంద్రరెడ్డి, తన తండ్రి దాదావలిపై చర్యలు తీసుకోవాలని పెద్దారవీడు పోలీ్‌సస్టేషన్‌లో పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్సై అనిల్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
రౌడీషీటర్ అరెస్టు
నికరంపల్లికి చెందిన దూదేకుల దాదావలితో కుదిరిన ఒప్పందం మేరకు బత్తుల అంకయ్యను హత్య చేసేందుకు సుపారీ తీసుకొని పథక రచన చేస్తున్న రౌడీషీటర్ బట్టిగిరి రాఘవేంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 2021లో రౌడీషీటర్ రాఘవేంద్రరెడ్డిపై హత్య కేసు నమోదైంది. ఆ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.
అనుమానంతో భార్యను
హత్య చేసిన భర్త
కంభం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అనుమానంతో భార్యను తలపై కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన కంభం పట్టణం సాద్‌మియా వీధిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకొంది. ఎస్సై నరసింహారావు కథనం ప్రకారం, పట్టణంలో సాద్‌మియా వీధిలో అర్ధవీటి శివరంగయ్య, భార్య అంజలి (40)తో నివసిస్తున్నారు. శివరంగయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తుండగా వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహం చేశాడు. అయితే ఇటీవల భార్య అంజలి ప్రవర్తనపై శివరంగయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇరువురి మధ్య వాదన చోటుచేసుకొంది. దీంతో శివరంగయ్య కోపంతో కర్ర తీసుకొని అంజలి తలపై బలంగా కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు శివరంగయ్య పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు ఎస్సై తెలిపారు. హత్య జరిగిన ప్రాంతానికి సీఐ మల్లికార్జునరావు, ఎస్సై పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.