గుండ్లకమ్మ పనులకు బ్రేక్
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:03 AM
కీలక అంశాలపై పాలకులు సీరియస్‌గా దృష్టిపెట్టని ఫలితం ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులకు ఆటంకమైంది. మొత్తం 15 గేట్లలో 13 పనులు పూర్తిచేసి మరో రెండింటిని ఏర్పాటు చేయాల్సిన సమయంలో బ్రేక్ పడింది. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్ ఉండగా కొంతైనా ఇప్పిస్తే తదుపరి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు ఏజెన్సీ పదేపదే అధికారులను కోరింది.
15 గేట్లలో 13 వరకు పూర్తి
మరో రెండు చేస్తే పూర్తిస్థాయిలో నీటి నిల్వకు అవకాశం
రూ.4కోట్ల బిల్లులు పెండింగ్
సగం అయినా ఇస్తే మిగతా పనులు చేస్తామంటున్న కాంట్రాక్టర్
పెద్దమొత్తంలో కూలి డబ్బుల బకాయితో పనులు ఆపేసి వెళ్లిపోయిన సదరు ఏజెన్సీ
ప్రస్తుతం 2.55 టీఎంసీల నీరు నిల్వ
కీలక అంశాలపై పాలకులు సీరియస్‌గా దృష్టిపెట్టని ఫలితం ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులకు ఆటంకమైంది. మొత్తం 15 గేట్లలో 13 పనులు పూర్తిచేసి మరో రెండింటిని ఏర్పాటు చేయాల్సిన సమయంలో బ్రేక్ పడింది. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్ ఉండగా కొంతైనా ఇప్పిస్తే తదుపరి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు ఏజెన్సీ పదేపదే అధికారులను కోరింది. చివరకు కీలకమైన మంత్రులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఎంతకీ నిధులు విడుదల కాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ చేతులేత్తేశాడు. అలాగే గేట్లు అమర్చడంతోపాటు పెయింటింగ్, ఇతర పనులు చేసే కూలీలను కర్నూలుకు చెందిన వ్యక్తి సమకూర్చారు. ఆయనకు లక్షల్లో వేతనాలు బకాయిపడటంతో అవి ఇచ్చేంతవరకు తాము పనులు చేయలేమని కూలీలు వెళ్లిపోయారు. దీంతో పూర్తిచేసిన గేట్లు ప్రాజెక్టు వద్ద ఉండిపోయాయి.
ఒంగోలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : నిత్యం ముప్పై మంది వరకు కూలీలతో గేట్ల పనులు జరుగుతూ సందడిగా ఉంటున్న గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద వారం రోజులుగా నిర్మానుష్య వాతావ రణం నెలకొంది. చేసిన వాటికి బిల్లులు పెండింగ్ ఉండటంతో సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపేశారు. పంటలకు సంబంధించి కీలక సమయం కావడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే గత నెలలో కురిసిన వర్షాలతో కొంత ఉపశమనం పొందిన రైతులు సంక్రాంతి తర్వాత నీటి కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉంది. దీంతో మిగిలిపోయిన రెండు గేట్ల వద్ద స్టాప్ లాక్ గేట్లను పెట్టి అధికారులు నిల్వ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభు త్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టును గాలికొదిలేసిన విషయం విదితమే. కనీసం గేట్ల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా ఇవ్వక అవి దెబ్బతినిపోయాయి. తక్షణం గేట్లకు మరమ్మతులు చేయకపోతే అవి దెబ్బతిని నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని 2022 సీజన్‌కు ముందే ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా 15 గేట్లలో 6, 7 నంబర్ గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటి మరమ్మతులకు రూ.కోటి ఇవ్వాలని ప్రతిపాదనలు పంపి అవి దెబ్బతినకుండా స్టాప్‌లాక్ గేట్లను అమర్చారు.
రెండేళ్లుగా ఎండగట్టారు..
స్టాప్‌లాక్ గేట్లను పెట్టామన్న ధీమాతో అధికారులు నీటిని నింపే ప్రయత్నం చేయగా ఆ ఏడాది ఆగస్టు 31న వచ్చిన వరద నీటితో 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నీరం తా సముద్రపాలైంది. రిజర్వాయర్‌లో పెంచుతు న్న చేపలు కూడా పోయి వందలాది జాలర్ల కుటుంబాలు నష్టపోయాయి. అనంతరం అధికా రులు దెబ్బతిన్న గేట్లను తాత్కాలికంగా కొన్ని స్టాప్‌లాక్ గేటు సెగ్మెంట్లను పెట్టారు. అలా 15 గేట్లలో మూడింటి వద్ద స్టాప్‌లాక్ గేట్లు అప్ప టికే పెట్టడంతో నీటిని నిల్వ చేసే ధైర్యం చేయలేక ఆ ఏడాది ఆయకట్టుకు నీరివ్వకుండా ఎండగట్టారు.
టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో కదలిక
అనంతరం కొంతకాలానికి ప్రత్యేకించి నాటి టీడీపీ ఎమ్మెల్యేలు.. రైతు సంఘాల ఆందోళనలు, ఒత్తిళ్లతో 6,7 గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచారు. డబ్బు ఇస్తారన్న నమ్మకం లేక పెద్దగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అతికష్టంపై ఒకరిని అధికారులు కష్టపడి తెచ్చి పనులు అప్పగించారు. సకాలంలో బిల్లులు ఇవ్వక ఆ పనులలో జాప్యం జరిగింది. మొత్తం రూ.98 లక్షలతో టెండరు ఖరారు కాగా అతికష్టంపై రూ.60లక్షలు ఇచ్చారు. అదే కాంట్రాక్టర్‌కు మరో రూ.70లక్షలతో కొట్టుకుపోయిన 3వ నంబరు గేటు కూడా చేయాలని సూచించారు. అందుకు సదరు కాంట్రాక్టర్ విముఖత వ్యక్తం చేసి ముందుగా ఒప్పుకున్న రెండు గేట్ల పనులు చేసి వెళ్లిపోయారు. ఈలోపు ప్రాజెక్టును సందర్శించిన నిపుణుల కమిటీ ప్రాజెక్టులోని మిగిలిన 12 గేట్లకు కూడా మరమ్మతులు చేయాలని నివేదించింది. అందుకు సంబంధించిన అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపే పనిలో అధికారులు ఉండగా 2023 డిసెంబరులో వరద నీటిలో మరో గేటు కొట్టుకుపోయింది. గతంలో కొట్టుకుపోయిన 3వ నెంబరు గేటు పక్కనే ఉండే 2వ నెంబరు గేటు ఈసారి కొట్టుకొని పోయి నీరంతా సముద్రపాలై రెండో ఏడాది కూడా ఆయకట్టుకు నీరివ్వలేదు.
కూటమి రాకతో ఊపందుకున్న పనులు
రెండేళ్లు నీరివ్వక దాదాపు రూ.500 కోట్ల మేర పంట ఉత్పత్తులను రైతులు నష్టపోయారు. ఈ తరుణంలో ఎన్నికలు సమీపిస్తుడటంతో 2024 ఫిబ్రవరిలో రూ.9.50 కోట్లతో 12గేట్ల పనులకు నాటి వైసీపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రాష్ట్రంలో ఎవరూ ముందుకు రాలేదు. అహ్మదాబాద్‌కు చెందిన సంస్థ టెండర్ వేసి ఆర్డర్ పొంది పనులు ప్రారంభించింది. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తొలి సమీక్షలోనే గుండ్లకమ్మ పనులకు నిధులు మంజూరుపై ఉన్నతస్థాయిలో హామీ లభించడంతో సదరు కాంట్రాక్టు ఏజెన్సీ త్వరితగతిన పనులు చేపట్టింది. మొత్తం రూ.9.50కోట్లతో టెండర్ పిలవగా రూ.6.80 కోట్లకు దక్కించుకున్న సంస్థ గేట్లను అహ్మదాబాద్‌లోని తమ వర్క్ షాపులోనే చేసి ట్రాలీలపై ప్రాజెక్టు వద్దకు తెచ్చి ఇక్కడ కూలీలతో ఆ గేట్లకు బోల్టులు, ఫిటింగ్, రంగులు వేయడం, డ్యామ్‌లో అమర్చడం వంటి పనులు చేయించారు. కూలీల కాంట్రాక్టు కర్నూలుకు చెందిన వ్యక్తి చేస్తున్నారు. కాగా ఆగస్టులో సుమారు రూ.2.50 కోట్ల బిల్లులను ప్రభుత్వం సదరు కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతోపాటు గతంలో కొట్టుకుపోయిన మూడో నంబర్ గేటును కూడా అప్పగించి ఈ సీజన్‌లో నీరివ్వాలన్న లక్ష్యం నిర్దేశించారు. తదనుగుణంగా అధికారుల పర్యవేక్షణ కూడా సాగగా ఇక సదరు ఏజెన్సీ గేట్ల పనులు త్వరితగతిన చేస్తూ వచ్చింది.
ప్రాజెక్టుపైనే పడి ఉన్న గేటు
డిసెంబరు రెండో పక్షం నాటికి తాము చేయాల్సిన 13 గేట్ల పనుల్లో 11 గేట్లు పనులు కాంట్రాక్టు సంస్థ చేసింది. అంతకు ముందే రెండు అయ్యాయి. అలా మొత్తం 13 పూర్తయ్యాయి. అయితే తొలుత బాగానే నిధులిచ్చిన ప్రభుత్వం తర్వాత బిల్లులు గురించి పట్టించుకోలేదు. దాదాపు రూ.5కోట్ల పనులు చేసి ఉండగా రూ.4కోట్ల బిల్లుల అప్‌లోడ్ చేసి ప్రభుత్వానికి నివేదించి ఉన్నారు. గత నెలలో కాంట్రాక్టు ఏజెన్సీ అధికారులపై ఒత్తిడి తీసుకరావడమే కాక ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడును, ఇటీవల జిల్లా మంత్రి డాక్టర్ స్వామిని కూడా కలిసి కోరినట్లు సమాచారం. అయినా నిధులు విడుదల కాలేదు. అయినప్పటికీ 14వ గేటును సిద్ధం చేసి ప్రాజెక్టు వద్దకు తెచ్చారు. అయితే ఆ గేట్లకు ఇక్కడ అవసరమైన ఇతర పనులు చేసే కూలీలను సమకూర్చే ఏజెన్సీ నిర్వాహకుడికి ఇప్పటికే తమకు రూ.50లక్షల మేర బకాయి ఉంది. అవి ఇవ్వకుండా తదుపరి పనులు చేయలేమని తేల్చిచెప్పి పనులు ఆపేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేంత వరకు ఆ సొమ్ము ఇవ్వలేమని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులు చెప్పడంతో ఇక్కడ చేస్తున్న కూలీలందరినీ తీసుకొని ఏజెన్సీ వ్యక్తి వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం 14వ గేటు అహ్మదాబాద్ నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే కూలీలు లేక ప్రాజెక్టు వద్ద పడేశారు.
3 టీఎంసీలు నిల్వ చేసే అవకాశం
పనులు చివరకు వచ్చిన సమయంలో నిధులు ఇవ్వడంలో జాప్యంతో గుండ్లకమ్మ గేట్ల పనులకు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే 13గేట్లు పూర్తితో తమ వద్ద ఉన్న స్టాప్‌లాక్ గేట్లు మిగిలిన రెండింటి వద్ద అమర్చి అధికారులు నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.85 టీఎంసీలు కాగా పూర్తికాకుండా 3 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటివరకు 2.55 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లోకి చేరింది. గత నెలలో కురిసిన వర్షాలతో ఆయకట్టుకు నీరిచ్చే అవసరం రాకపోవడంతో మరో వారంరోజుల్లో 3 టీఎంసీలకు చేరనుంది. సంక్రాంతి తర్వాత రైతుల నుంచి నీటి కోసం డిమాండ్ వచ్చే అవకాశం ఉండగా తర్వాత వాన నీరు ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉండదు కనుక ఉన్న నీటిని వదలాల్సి వస్తోది. తక్షణం పాలకపక్ష పెద్దలు దృష్టిసారించి నిధులు విడుదల చేయించడంతోపాటు మిగిలిన రెండు గేట్ల పనులు కూడా పూర్తిచేయించి రిజర్వాయర్ సామర్థ్యం మేర నీటిని నిల్వ చేసేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.