Share News

మంత్రముగ్గులై..

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:23 PM

ఇలపైకి ఇంద్రధనుస్సు దిగివచ్చింది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నారీమణులు వేసిన రంగవల్లులు మంత్రముగ్దుల్ని చేశాయి. పండుగ ముందే వచ్చిందా!? అన్న రీతిలో వేసిన ముగ్గులు ముచ్చటగొలిపాయి. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్‌ పార్టనర్‌ క్రాఫ్ట్‌వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) సహకారంతో ఆదివారం గిద్దలూరులో ఏర్పాటు చేసిన పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ముగ్గుముచ్చట్లకు మనోహరరూపం ఇచ్చారు. సంక్రాంతి శోభకు వన్నెలద్దారు. పోటీలకు లక్ష్మీ డెయిరీ వ్యవస్థాపకులైన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి లోకల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు.

మంత్రముగ్గులై..
గిద్దలూరులో జరిగిన ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి విజేత టి.నాగదుర్గకు ఫ్రిజ్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ ఐవీ సుబ్బారావు తదితరులు

భారీగా తరలివచ్చిన మహిళలు

కిటకిటలాడిన టెన్నిస్‌ కోర్టు ఆవరణ

గిద్దలూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : గిద్దలూరులోని టెన్నిస్‌ కోర్టులో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో 201 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నింగిలోని చుక్కలను నేలకు దించారు. తమ వేలికొనలతో ఒక్కో చుక్కను కలుపుతూ రమణీయమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. కొందరు సామాజిక స్పృహను జోడించారు. సంక్రాంతి విశిష్టతను, తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా పలువురు వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నాయి. గిద్దలూరుకు చెందిన టి.నాగదుర్గకు ప్రథమ, పట్టణానికే చెందిన ఎ.దివ్యశ్రీకి ద్వితీయ, ఎస్‌.సరితకు తృతీయ బహుమతులు లభించాయి. ప్రథమ విజేతకు రిఫ్రిజిరేటర్‌, ద్వితీయ స్థానంలో నిలిచిన మహిళకు వాషింగ్‌ మిషన్‌, తృతీయ విజేతకు గ్రౌండర్‌ను లోకల్‌ స్పాన్సర్‌ అయిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అందజేశారు. మరో ముగ్గురు మహిళలకు స్పెషల్‌ కన్సొలేషన్‌ బహుమతులు, మరో 10 మంది కన్సొలేషన్‌ బహుమతులను ఇచ్చారు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు ప్రత్యేక బహుమతితోపాటు గ్యాస్‌లైటర్‌, పైప్‌, మరికొన్ని బహుమతులను అందజేశారు.

ముగ్గుల పోటీల నిర్వహణ అభినందనీయం

తెలుగు సంప్రదాయాలను గౌరవిస్తూ ఏటా ‘ఆంధ్రజ్యోతి’ పోటీలు నిర్వహించడం అభినందనీయం ఈ పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిష్పక్షపాతంగా విజేతలను ఎంపిక చేస్తారని అందరూ అంటుంటే విన్నాను. ఇప్పుడు చూస్తున్నాం.

- టి.నాగదుర్గ, ప్రథమ బహుమతి విజేత

మహిళలకు ప్రోత్సాహం

ఏటా పోటీల్లో పాల్గొంటాను. గతంలో కన్సొలేషన్‌ బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ద్వితీయ బహుమతి లభించింది. ముగ్గుల పోటీలు మహిళల్లో సృజనాత్మకతను వెలికితీస్తాయి. ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతికి అభినందనలు.

ఎ.దివ్యశ్రీ, ద్వితీయ బహుమతి విజేత

ఆనందంగా ఉంది

చాలాసార్లు ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. గత ఏడాది నంద్యాలలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఈ ఏడాది కూడా బహుమతి వస్తుందని ఊహించాను. తృతీయ స్థానం లభించింది. చాలా ఆనందంగా ఉంది.

ఎస్‌.సరిత, తృతీయ బహుమతి విజేత

Updated Date - Jan 05 , 2025 | 11:23 PM