Share News

వ్యవసాయమార్కెట్‌ కమిటీ నిధులు గోడపాలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:26 AM

అన్నదాతలకు అవసరమైన, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో నూతన కార్యాలయం నిర్మిస్తారిన ఆశించిన అవి అడియాసలుగానే మిగిలాయి.

వ్యవసాయమార్కెట్‌ కమిటీ నిధులు గోడపాలు

పొదిలి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతలకు అవసరమైన, మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో నూతన కార్యాలయం నిర్మిస్తారిన ఆశించిన అవి అడియాసలుగానే మిగిలాయి. రైతులకు సేవలు అందించడం అట్టుంచి మార్కెట్‌ కమిటీ నిధులు కూడా వృథా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులకు సేవలు అందించడంలో మాత్రం సంబంధిత శాఖ అధికారులు విఫలమౌతున్నారు.

పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, తర్లుపాడు మండలాలకు సంబంధించి వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సుమారుగా 50 సంవత్సరాల క్రితం పొదిలిలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా కేవలం ప్రభుత్వం నిర్ధేశించిన నిధుల వసూలు లక్ష్యాలను అధిగమించడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. లక్ష్యాలతోపాటు రైతుల అందించాల్సిన సేవల ను గాలికి వదిలేస్తున్నారు. ఏఎంసీల పరిధిలో జోరుగా జీరో వ్యాపారం సాగుతున్నప్పటికీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహారిస్తు న్నానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మార్కెట్‌కమిటీ నిధులతో రైతులకు అవసరమైన పనులు, పరికరాలు అందించ డంలో నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తున్నా ఇప్పటికీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం అద్దెభవనాల్లోనే కొనసాగుతోంది. ఏఎంసీ నిధులతో లక్షలు వెచ్చించి నిర్మించిన గోడౌన్లు మాత్రం నిరుపయోగంగా ఉన్నాయి.

గత వైసీపి ప్రభుత్వ హయాంలో మార్కెట్‌ కమిటీ నిర్మాణం కోసం తలమళ్ల గ్రామ సమీపంలో ఒంగోలు నంద్యాల ప్రధాన రహదారి పక్కనే సుమారుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ స్థలంలో కార్యాలయ భవనాలు నిర్మించకుండా కేవలం ప్రహారీగోడ నిర్మించారు. దీని కోసం 60 లక్షలు మార్కెట్‌ కమిటీ నిధులు కేటాయించారు. అప్పట్లోనే పరిపాలన భవనం నిర్మించకుండా రూ.60లక్షలతో ప్రహారిగోడ నిర్మాణం ఎందుకు చేపట్టారో మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మిగిలింది. 2021 ఆగస్టు నెలలో ప్రహారీగోడ నిర్మించి ప్రధాన ద్వారానికి ఇనుపగేటును అమర్చారు. ఆరువాత వైసీపి పాలనలో చివరి మూడేళ్లలో కూడా భవన నిర్మాణాలకు అధికారులు చొరవ చూపలేదు. దీంతో ఆప్రాంతం మొత్తం చిల్లచెట్లతో నిండి చిట్టడివిని తలపిస్తోంది. విలువైన స్థలం కేటాయించినప్పటికి భవననిర్మాణ పనులు చేపట్టకపోవడంతో 60లక్షల నిధులు బూడిదలోపోసిన పన్నీరులా వృథా అయ్యాయి. అంతే కాకుండా ఏర్పాటు చేసిన గేటును ఇటీవల దొంగలు తాళాలు బద్దలుకొట్టి తీసుకపోవడానికి ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాతనైనా మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకొని పరిపాలన భవనంతోపాటు రైతులకు అవసరమైన గిడ్డంగులను ఏర్పాటు చేయాలని ఆయా మండలాల అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:26 AM