అక్రమం తేట‘తెల్ల’ం
ABN , Publish Date - Jan 08 , 2025 | 02:13 AM
మట్టి అక్రమాలను విన్నాం. ఇసుక మాఫియాను చూశాం. జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఈ అక్రమం చూస్తే ఎవరైనా ‘తెల్ల’బోవాల్సిందే. అరుదుగా దొరికే తెల్లరాయిని కూడా కొందరు వదలడం లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఈ మాఫియా రెచ్చిపోతోంది. వెలిగండ్ల ప్రాంతంలోని తెల్లరాయి క్వారీ అడ్డాగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
నిషేధమున్నా ఆగని తెల్లరాయి రవాణా
సరుకు పేరు మార్చి లారీల్లో తరలింపు
మూడు నెలల్లో రూ.50 కోట్ల వైట్ క్వార్జ్ట్ రాష్ట్రాలు దాటవేత
మహిళ ఆధ్వర్యంలో ముఠా
అధికారులు, నేతలు కీలకపాత్ర
వాహనాలు పట్టుబడినా వదిలేసిన పోలీసులు
వారితీరుపైనా అనుమానాలు
మట్టి అక్రమాలను విన్నాం. ఇసుక మాఫియాను చూశాం. జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఈ అక్రమం చూస్తే ఎవరైనా ‘తెల్ల’బోవాల్సిందే. అరుదుగా దొరికే తెల్లరాయిని కూడా కొందరు వదలడం లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఈ మాఫియా రెచ్చిపోతోంది. వెలిగండ్ల ప్రాంతంలోని తెల్లరాయి క్వారీ అడ్డాగా అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెల్లరాయి (వైట్ క్వార్ట్జ్) రవాణాపై నిషేధం విధించినా తప్పుడు వేబిల్లులతో ఎల్లలు దాటిపోతోంది. గడిచిన మూడు నెలల్లో రూ.50 కోట్లకుపైగా విలువైన ఖనిజం తరలినట్టు సమాచారం. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టు ఈ అక్రమంలో కీలక రాజకీయ నేతలతోపాటు పోలీసులూ, అధికారులూ ఉన్నట్టు తెలుస్తోంది.
కనిగిరి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): వెలిగండ్ల మండలంలోని హుస్సేన్‌పురం క్వారీ తెల్లరాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. నియోజకవర్గంలో పీసీపల్లి, పామూరు, సీఎస్‌పురం, వెలిగండ్ల మండలంతో పాటు కనిగిరిలో ఓగ్రామంలో తెల్లరాయి ఖనిజాలు ఉన్నాయి. ఇక్కడ లభించే తెల్లరాయికి మంచి గిరాకీ ఉంది. గూడూరు ప్రాంతం నుంచి వచ్చిన కొందరు ముఠాగా ఏర్పడి తవ్వి తెల్లరాయిని చిన్నచిన్న వాహనాల ద్వారా వెలిగండ్ల మండలం, హుస్సేన్‌పురం గ్రామంలోని క్వారీకి చేరుస్తారు. అక్కడ క్రష్ చేసి రవాణా చేస్తున్నట్లు సమాచారం.
దందా మాటున పరాయి జిల్లాల ముఠాలు
నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలోని ఓ మహిళ ద్వారా పెద్దఎత్తున ముఠాలు వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం క్వారీ వద్ద పనిచేస్తున్నట్లు సమాచారం. వీరంతా హుస్సేన్‌పురం సమీపాన ఉన్న మరో మూరుమూల పల్లెలో ఉంటూ పనులు చేస్తున్నట్లు తెలిసింది. వీరు రాత్రి వేళల్లో కూడా క్వారీలో ఉండి లారీలకు తెల్లరాయి నింపుతున్నారు. ఆ తర్వాత లారీలో సరుకు బయటకు కనిపించకుండా పరదా కప్పి తరలిస్తున్నారు.
మూడు నెలలుగా రాయి రవాణా
మూడు నెలలుగా హుస్సేన్‌పురం వద్ద ఉన్న క్వారీ నుంచి తెల్లరాయిని రాత్రికి ఊరు దాటించి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతిరోజూ 120 నుంచి 150 టన్నుల వరకు అక్రమంగా తరలిపోతోంది. ప్రస్తుతం గ్రేడ్ 1 తెల్లరాయి టన్ను రూ.25 వేల వరకు పలుకుతోంది. గ్రేడ్ 2 రూ.18 వేలుంది. సగటున రోజుకు రూ.40 లక్షలు, నెలకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన ఖనిజం తరలిపోతోంది. మూడు నెలలుగా ఇంచుమించు రూ.50 కోట్ల అక్రమ వ్యాపారం సాగినట్టు తెలుస్తోంది.
తప్పుడు వేబిల్లులతో తరలింపు
రాష్ట్రంలో తెల్లరాయి ఖనిజం రవాణా నిలిపివేయటంతో పాటు ఆన్‌లైన్ బిల్లులు కూడా నమోదు కావటం లేదు. హుస్సేన్‌పురం క్వారీ నుంచి లారీల ద్వారా తరలించే తెల్లరాయి రవాణాలో బల్లిపల్లి గ్రామం అడ్డరోడ్డు వద్ద ఉన్న వే బ్రిడ్జ్‌లో సిమెంట్, ఇతర సరుకుల పేరుతో కాటా వేయించి అవే బిల్లులతో తెల్లరాయిని తరలిస్తున్నారు.
లారీలను కొత్తూరు వద్ద నిలిపివేసిబేరం
తెల్లరాయి రవాణా చేస్తున్నట్లు లారీలో సరుకును గుర్తించిన పోలీసులు వాటిని తరలిస్తూ బేరం మొదలుపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతనెల 23వ తేదీ రాత్రి వరకు కొత్తూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద పట్టుకున్న లారీలను ఉంచారు. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బల్లిపల్లి వద్ద పట్టుకున్ను లారీలను రాత్రి 11 గంటల వరకు ఊరు చివర ఉంచి ఆ తర్వాత పంపివేశారు. దీనివెనుక లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గుట్టురట్టు ఇలా..
గతనెల 23న జరిగిన అక్రమ రవాణాతో గుట్టు బయటపడింది. తెల్లరాయి రవాణా చేసే 3 టర్బో లారీలు బల్లిపల్లి అడ్డరోడ్డు సమీపంలో వేబ్రిడ్జ్ వద్దకు వచ్చాయి. ఎప్పటిలాగానే దందా సాగించే ముఠా నాయకులకు, కాపలాదారులకు మామూళ్ల విషయంలో తేడా వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై కనిగిరి సీఐ ఖాజావలికి సమాచారం చేరింది. అక్కడకు చేరుకున్న పోలీసులు తమశైలిలో విచారించగా లారీ డ్రైవర్‌లు ముఖం తేలేశారు. ఆ 3 టర్బో లారీలను పరిశీలించగా తెల్లరాయి బయటపడింది. దీంతో ఆయా లారీలను స్వాధీనం చేసుకుని కనిగిరికి తరలించారు. ఈ విధంగా అక్రమం గుట్టు రట్టయింది.