ఆదాయం వైపు మార్టూరు పంచాయతీ
ABN , Publish Date - Jan 05 , 2025 | 11:29 PM
మార్టూరు గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం పెరిగేలా పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా పంచాయతీ అధికారులకు పంపినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఉన్న ఆదాయం కన్నా అదనపు ఆదాయం పెరగడానికి విలేజ్ గ్రోత్ సెంటర్లు అనే పథకానికి రూపకల్పన చేసింది.
విలేజ్ గ్రోత్ సెంటర్ల పథకం కింద అభివృద్ధి
జిల్లా అధికారులకు మూడు ప్రతిపాదనలు
మార్టూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : మార్టూరు గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం పెరిగేలా పంచాయతీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా పంచాయతీ అధికారులకు పంపినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఉన్న ఆదాయం కన్నా అదనపు ఆదాయం పెరగడానికి విలేజ్ గ్రోత్ సెంటర్లు అనే పథకానికి రూపకల్పన చేసింది. అందుకు సంబందించిన వివరాలను రాష్ట్రం నుంచి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు వచ్చినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీలలో విలువైన పంచాయతీ స్థలాల్లో ఏదైనా భవనా నిర్మాణాలు,షాపులు, కల్యాణ మండపాలు, ఇతర వసతులు ఏవైనా నిర్మించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అద్దెలకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేలా పథకాన్ని రూపొందించారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఇలాంటి అవకాశాలు లేక పోయినా మేజరు గ్రామ పంచాయతీ మార్టూరు పంచాయతీ నుంచి మూడు ప్రతిపాదనలను తయారు చేసినట్లు తెలిసింది. గ్రానైట్ పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందిన మార్టూరు గ్రామం మీదుగా చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారి వెళ్లడం, ఇతరత్రా కారణాలు వల్ల గ్రామంలోని ఖాళీ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మండల కాంపెక్స్ వద్ద, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న పంచాయతీకి చెందిన సుమారు 20 సెంట్ల స్థలంలో పెట్రోలు బంకు నిర్మాణం చేపట్టి, దానిని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తే పంచాయతీకి ఆదాయం పెరుగుతుందని, అందుకు రూ.కోటి మంజూరు చేయాలని మార్టూరు పంచాయతీ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అలాగే బలరాం కాలనీ సమీపంలో రెండో ప్రతిపాదనగా చెరువు సమీపంలోని 4 సెంట్ల పంచాయతీ స్థలంలో షాపుల నిర్మాణం కోసం కూడా రూ.25 లక్షలు నిధులు మంజూరు చేయాలని, ఈ స్థలం సమీపంలో దాదాపు 40 సెంట్లకు పైగా ఉన్న పంచాయతీ స్థలంలో కల్యాణ మండపం నిర్మించడం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేయాల్సిందిగా మూడో ప్రతిపాదన తయారు చేసినట్లు తెలిసింది. ఈ మూడు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ లభిస్తే మార్టూరు పంచాయతీకి అదనపు ఆదాయంతోపాటు పట్టణం అభివృద్ధి చెందుతుంది. దాదాపుగా మండలంలోని మార్టూరు పంచాయతీ నుంచి మాత్రమే ఈ ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిసింది.