Share News

నూతనోత్సాహం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:08 AM

జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే వివిధ వర్గాల ప్రజలు ప్రత్యేకించి యువత కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాలు నిర్వహించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా వేడుకలు జరిగాయి.

నూతనోత్సాహం
మంత్రి స్వామికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్తున్న టీడీపీ కొండపి నియోజకవర్గ నాయకులు రామయ్య, శ్రీనివాసరావు, వసంతరాయుడు, కృష్ణారెడ్డి

కిటకిటలాడిన ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయాలు

తరలివచ్చిన కార్యకర్తలు, ఇతర వర్గాలు

ఆలయాలు, మందిరాల్లో భక్తుల పూజలు, ప్రార్థనలు

సందడిగా నూతన సంవత్సర వేడుకలు

ఒంగోలు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే వివిధ వర్గాల ప్రజలు ప్రత్యేకించి యువత కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాలు నిర్వహించింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా వేడుకలు జరిగాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పతనమై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి నూతన సంవత్సరం కావడంతో టీడీపీ శ్రేణులు, వారి మద్దతుదారులు మరింత ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల ఇళ్లు, కార్యాలయాలు కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి తన స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెంలోని ఇంటి వద్ద పార్టీశ్రేణుల మధ్య నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్నారు. కొండపి నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు, అధికారులు, ఇతర వర్గాల వారు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నివాసాలు, కార్యాలయాలు పార్టీశ్రేణులు, అభిమానులతో కిటకిటలాడాయి. టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ కార్యాలయంలో టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, తన నివాసంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వేడుకలు చేసుకున్నారు. ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య ఆధ్వర్యంలో నాయుడుపాలెం సమీపంలోని దామచర్ల కంపెనీ వద్ద, ఒంగోలు మంగమూరు రోడ్డులోని ప్రగతినగర్‌ సమీపంలో ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కనిగిరిలో ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైపాలెంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, దర్శిలో ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మిల నేతృత్వంలో వేడుకలు భారీగా జరిగాయి. వేలాదిమంది టీడీపీ శ్రేణులు, ఇతర వర్గాల వారు పాల్గొన్నారు. సంతపేటలోని క్యాంపు కార్యాలయంతోపాటు వైసీపీ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. వైసీపీ నేతల ఇళ్ల వద్ద ఆ సందడి కనిపించ లేదు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మృతితో కేంద్రప్రభుత్వం వారంరోజులు సంతాప దినాల నేపథ్యంలో ఉన్నతాధికారులు పరిమితంగా వేడుకల్లో భాగస్వాములయ్యారు. తెల్లవారుజాము నుంచి దేవాలయాలలో పూజలు, ఇతర మందిరాల్లో ప్రార్థనలు పెద్దఎత్తున నిర్వహించారు.

Updated Date - Jan 02 , 2025 | 01:08 AM