whale shark : మత్స్యకారుల వలకు చిక్కిన భారీ వేల్‌షార్క్!
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:21 AM
మండలంలోని పూడిమడక శివారు కడపాలెం సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన సొర చేప(వేల్ షార్క్) చిక్కింది.

రెండున్నర టన్నులకు పైగా బరువు
తిరిగి సముద్రంలోకి నెట్టలేక.. తీరంలోనే వదిలేసిన వైనం
అచ్యుతాపురం(అనకాపల్లి జిల్లా), జనవరి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని పూడిమడక శివారు కడపాలెం సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన సొర చేప(వేల్ షార్క్) చిక్కింది. తిమింగలం జాతికి చెందిన ఈ చేప సుమారు 2.5 టన్నుల బరువుంది. వీటిని వ్యాపారులు కొనుగోలు చేయరు. దీంతో సముద్ర తీరంలోనే వదిలేశారు. కడపాలెం గ్రామానికి చెందిన సూరాడ వసంతరావు, సూరాడ ధర్మ, మరో 30 మంది మత్స్యకారులు కలిసి ఆదివారం ఉదయం సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. అచ్యుతాపురం-రాంబిల్లి మండలాల సరిహద్దులోని సీతపాలెం తీరం నుంచి వల వేసుకుంటూ సముద్రం లోపలికి వెళ్లారు. వల బరువుగా ఉండడంతో భారీగా చేపలు పడ్డాయని భావించి సాయంత్రం 4గంటలకు తీరానికి చేర్చారు. తీరా వలలో అరుదైన భారీ సొరచేప కనిపించడంతో అవాక్కయారు. తెల్లని మచ్చలతో ఉన్న ఈ చేపను ‘పప్పరమేను’ అని పిలుస్తామని మత్స్యకారులు తెలిపారు. అప్పటికే వలలో పడిన ఇతర జాతుల చేపలను తినేసిందని, వల బాగా పాడైపోయిందని చెప్పారు. ఇలాంటి సొరచేపలను ఇక్కడ వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయరని తెలిపారు. అధిక బరువు వుండడంతో తిరిగి సముద్రంలోకి నెట్టలేక తీరంలో వదిలేశామని, కెరటాలు తీరంలో ఎక్కువ దూరం వస్తే.. అది తిరిగి సముద్రంలోకి వెళుతుందని, లేదా చనిపోతుందని చెప్పారు.