Share News

SERP Employees : సెర్ప్‌ సిబ్బందికి ‘ఇంక్రిమెంట్‌’ ఇక్కట్లు

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:44 AM

తమ సమస్యలు పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 రోజులు సమ్మె చేసిన సెర్ప్‌ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈఓ చుక్కలు చూపిస్తున్నారు.

SERP Employees : సెర్ప్‌ సిబ్బందికి ‘ఇంక్రిమెంట్‌’ ఇక్కట్లు

  • గత ప్రభుత్వంలో 9 రోజుల సమ్మె

  • మార్చిలో రావాల్సిన జీతాల పెంపు ఇప్పటికీ దక్కని వైనం.. 3 వేల మంది బాధితుల ఆందోళన

  • నెలలుగా ఫైల్‌ను పెండింగ్‌లో ఉంచిన సీఈఓ

అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 రోజులు సమ్మె చేసిన సెర్ప్‌ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈఓ చుక్కలు చూపిస్తున్నారు. అప్పట్లో 9 రోజులు సమ్మె చేసిన సుమారు 3 వేల మంది సిబ్బందికి గత మార్చిలో దక్కాల్సిన ఇంక్రిమెంట్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులను అప్పట్లో అధికారులు పలు విధాలుగా బుజ్జగించి సమ్మె విరమింపచేశారు. సమ్మె కాలానికి జీతం కట్‌ చేయకుండా ఇస్తామని చెప్పి నమ్మించారు. అయితే గత ఆర్నెల్లుగా సెర్ప్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సిబ్బంది జీతం కట్‌ చేయడంతో పాటు వారికి మార్చిలో రావాల్సిన 6 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెర్ప్‌ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఒక్క కడప జిల్లా మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర సిబ్బంది కూడా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారు. అయితే సెర్ప్‌ మినహాయించి మిగిలిన శాఖల వారికి సమ్మె కాల జీతాలు కట్‌ చేయలేదు. వారికి ఇంక్రిమెంట్ల విషయంలో కూడా సమస్యలు లేవు.


సెర్ప్‌ ప్రధాన కార్యాలయం, కడప జిల్లా సిబ్బందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంక్రిమెంట్లు వచ్చేశాయి. మిగతా 3 వేల సిబ్బందికి జీతాల కటింగ్‌ ఫైల్‌ను అడ్డుపెట్టుకొని, ఇంక్రిమెంట్ల విషయంలో సెర్ప్‌ ఆఫీసులోని అధికారులు నాన్చుతున్నారు. ఇప్పటికే మంత్రి పలు దఫాలు అధికారులకు ఆదేశాలిచ్చినా స్పందన లేదు. సెర్ప్‌ కార్యాలయంలోని అధికారులు మాత్రం సీఈఓ అందుబాటులో లేరంటూ కాలయాపన చేస్తున్నారు. అధికారులు మాటతప్పి నిర్ధాక్షిణ్యంగా తమ 9 రోజుల జీతాలను కట్‌ చేశారని, మార్చిలో రావాల్సిన ఇంక్రిమెంట్‌లు అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు తమ ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని సెర్ప్‌ ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 06:44 AM