Bendikonda: బెండికొండ మాది!
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:57 PM
land encroachment జాతీయ రహదారి సమీపాన.. పలాస- కాశీబుగ్గ మార్కెట్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెండికొండపై వందలాది ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతోంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూమిపై కొంతమంది వైసీపీ నాయకుల కన్ను పడింది.
కబ్జా చేసేసిన వైసీపీ నాయకులు
భూముల చుట్టూ కంచె వేసిన వైనం
పట్టించుకోని అటవీ, రెవెన్యూశాఖలు
కూటమి ప్రభుత్వం ఉన్నా చర్యల్లేవ్
వజ్రపుకొత్తూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి సమీపాన.. పలాస- కాశీబుగ్గ మార్కెట్‌కు కూతవేటు దూరంలో ఉన్న బెండికొండపై వందలాది ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతోంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూమిపై కొంతమంది వైసీపీ నాయకుల కన్ను పడింది. ఈ క్రమంలో స్థానిక వైసీపీ నాయకులతోపాటు ప్రైవేటు వ్యక్తులు కూడా భూమి చుట్టూ కంచె వేస్తూ.. ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆపై సెంటు రూ.లక్షకుపైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచీ ఆక్రమణలు కొనసాగుతున్నా.. ఒక్కరోజు కూడా పరిశీలించిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బెండికొండ భూములు.. అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలో ఉన్నాయి. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆక్రమణదారులు యథేచ్ఛగా ఇక్కడ భూములు కబ్జా చేస్తున్నారు. పూండి పరిసర గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు బెండి వద్ద భూములను అధికంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం ఇక్కడ గతంలో స్థలం కేటాయించింది. ఆ స్థలానికి చుట్టు పక్కలా ఐదారు రెట్లు ఆ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆక్రమించుకున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఒక నాయకుడు సర్వే నెంబర్లు మార్చి తన కుటుంబ సభ్యుల పేరుమీద సుమారు 15 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
గురుకుల పాఠశాలకు కేటాయించినా..
టీడీపీ ప్రభుత్వ హయాంలో(2014- 2019 మధ్య) ఈ ప్రాంతంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పట్లో బెండికొండపై 15 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు కేటాయించారు. కాగా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల కాలనీకిగానూ ఈ భూములు స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి పాఠశాలకు మంజూరు చేసిన భూములు ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదు. అయినప్పటికీ వైసీపీ నాయకుల ఒత్తిడికి అధికారులు తలొగ్గారు. ఈ భూములు కూడా కొంతమేర ఆక్రణదారుల స్వాధీనంలో ఉన్నాయి. కాగా.. కొన్నాళ్ల తర్వాత గురుకుల పాఠశాల కోసం కొండపై 10 ఎకరాలను అధికారులు కేటాయించారు. ఈ భూమిని ఇంతవరకూ గురుకుల పాఠశాల సిబ్బంది స్వాధీనం చేసుకోలేదు. దీంతో ఈ భూములపై కూడా ఆక్రమణదారుల కన్ను పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత భారీస్థాయిలో బెండికొండ ఆక్రమణకు గురవుతున్నా.. అటవీ, రెవెన్యూశాఖల అధికారులు కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు, అధికారులు స్పందించి బెండి భూములు సర్వే చేయించి.. ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. పేదలకు ఈ భూములు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆక్రమణలు తొలగించాలి....
బెండికొండపై విలువైన భూములు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణదారుల్లో బడా నాయకులు ఉన్నారు. అప్పట్లో కొండపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని అధికారులను అనేక సార్లు వినతులు అందించాం. కానీ స్పందించ లేదు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో బెండికొండ భూములను సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలి. ఈ భూములను పేదలకు పంచాలి.
- మరడ ధుర్యోధనరెడ్డి, టీడీపీ మండల తెలుగుయువత అధ్యక్షుడు, వజ్రపుకొత్తూరు