Bhogi: ఊరూరా భోగి మంటలు
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:53 PM
Bhogi జిల్లావాసులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని వలసజీవులంతా స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు కళకళలాడాయి.
ఉత్సాహంగా జరుపుకున్న జిల్లా వాసులు
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
నేడు మకర సంక్రాంతి పర్వదినం
శ్రీకాకుళం కల్చరల్, జనవరి 13(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని వలసజీవులంతా స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు కళకళలాడాయి. సోమవారం వేకువజామున శ్రీకాకుళంలో సూర్యమహల్, డేఅండ్ నైట్, న్యూకాలనీ, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల జంక్షన్లతోపాటు తదితర ప్రాంతాల్లో భోగి వేడుకలు నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులు, పెద్దలు అంతా కలిసి భోగిమంటలు వేశారు. కొత్తవస్ర్తాలు ధరించారు. ఆలయాల్లో గోదాదేవి కల్యాణం, పూజలు చేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి పెద్దలు ఆశీర్వదించారు. అలాగే మంగళవారం మకర సంక్రాంతి వేడుకలకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. పితృదేవతలకు పూజలు చేశాక కొత్త వస్త్రాలను ధరించనున్నారు. ఈ మేరకు సంక్రాంతి పూజా సామగ్రి, కూరగాయలు, కిరాణా సరుకుల కొనుగోలుదారులతో శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాములు మార్కెట్ కిటకిటలాడింది.