Big market అష్టదిగ్బంధనంలో పెద్దమార్కెట్
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:42 PM
Big market శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు మార్కెట్ (పెద్ద మార్కెట్) జిల్లాలోనే అతిపెద్దది. రెండు దశాబ్దాల కిందట ఏర్పాటైన ఈ మార్కెట్‌కు నగరవాసులతో చుట్టు పక్కల 20 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు కాయగూరలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది.
రోడ్లపైనే వ్యాపారం
దుకాణాల ముందే తోపుడు బండ్లు
లోపలకు వెళ్తే బయటకు రావడం కష్టమే
కొనుగోలుదారులకు తప్పని అవస్థలు
శ్రీకాకుళం అర్బన్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు మార్కెట్ (పెద్ద మార్కెట్) జిల్లాలోనే అతిపెద్దది. రెండు దశాబ్దాల కిందట ఏర్పాటైన ఈ మార్కెట్‌కు నగరవాసులతో చుట్టు పక్కల 20 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు కాయగూరలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. అయితే, రోడ్లపైనే వ్యాపారాలు, దుకాణాల ముందే తోపుడు బండ్లు, అక్కడే వాహనాల పార్కింగ్‌తో ఆ మార్కెట్‌ను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. కనీసం నడిచే మార్గం కూడా ఉండడం లేదు. దీంతో లోపలకు వెళ్లేవారు బయటకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా నగరపాలక అధికారులకు పట్టడం లేదు.
దుకాణాలు వదిలేసి రోడ్లపై వ్యాపారాలు..
నగరపాలక సంస్థ అధికారులు రూ.కోట్ల వ్యయంతో మార్కెట్‌లో 340కి పైగా దుకాణాలు నిర్మించి వ్యాపారులకు ఇచ్చారు. అయితే వ్యాపారులు మాత్రం దుకాణాల్లో కాకుండా రోడ్లపై వ్యాపారం చేస్తున్నారు. రోడ్లపై నడిచేందుకు కూడా దారి లేకుండా చేస్తున్నారు. పెద్ద మార్కెట్‌లోకి వెళ్లాలంటే ఆరు మార్గాలు ఉన్నాయి. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ నుంచి, టౌన్‌హాల్ ఎదురుగా ఉన్న మార్గం, చేపల మార్కెట్ మీదుగా, పందుపుళ్ల జంక్షన్ గుండా, ఉల్లిపాయల హోల్‌సేల్ దుకాణం మీదుగా, చికెన్ సెంటర్ల ఎదురుగా ఉన్న మార్గం ద్వారా పెద్దమార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. అయితే ఈ ఆరు మార్గాలనూ దుకాణదారులు బ్లాక్ చేస్తున్నారు. బయట బండ్లపై వ్యాపారాలు సాగిస్తున్నారు. దీనికితోడు తోపుడు బండ్లను సైతం రోడ్లకు ఇరువైపులా నిలిపేసి కాయగూరలు, పండ్లు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లోకి వెళ్లి.. వచ్చేందుకు దారి లేక కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు. మరోపక్క పెద్ద మార్కెట్‌లో సెంటర్ పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే, మార్కెట్‌కు వచ్చేవారంతా తమ వాహనాలను ఎక్కడిబడితే అక్కడే నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది.
తోపుడు బండ్లకు సప‘రేటు’
పెద్దమార్కెట్‌లో దుకాణాల ముందు ఎవరైనా తోపుడు బండ్లు పెట్టుకోవాలంటే సంబంధిత దుకాణాదారులకు కొంత ముట్టజెప్పాల్సిందే. తోపుడు బండి నిలిపేందుకు రోజుకి రూ.100 నుంచి రూ.200, రాత్రి పూట విద్యుత్ దీపం పెట్టుకునేందుకు మరో రూ.50 చెల్లిస్తున్నట్లు తోపుడు బండ్ల వ్యాపారులు వాపోతున్నారు. అందువల్లే తమ దుకాణాల ముందు తోపుడు బండ్లు ఉన్నా దుకాణదారులు అడ్డుచెప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు, పోలీసులు
పెద్దమార్కెట్‌లో రద్దీ కారణంగా నిరంతరం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంటుంది. దీనిపై ఎప్పుడైనా ఉన్నతాధికారులు చర్చించినప్పుడు, లేదా ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్ప పోలీసులు మార్కెట్ వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. నగరపాలక సంస్థ అధికారులు సైతం తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. మార్కెట్ అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడి సమస్యలను పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వ్యాపారాలు చేస్తున్నా చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు.