Share News

పొరపాట్లకు తావివ్వొద్దు

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:40 PM

mistakes ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం లో ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పొరపాట్లకు తావివ్వొద్దు
రథసప్తమి ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే శంకర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు

  • ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • రథసప్తమి ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన

అరసవల్లి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యం లో ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రథసప్తమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి క్షేత్రస్థాయిలో ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వచ్చే నెల 2, 3, 4వ తేదీల్లో జరిగే మూడు రోజుల వేడుకల సందర్భంగా అరసవల్లికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలన్నా రు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, ఇతర అధికారులతో ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. క్యూలైన్ల ఏర్పాటు, తాగునీరు, శానిటేషన్‌, ప్రసాదాల పంపిణీ, ప్రవేశ మార్గాలు, పార్కింగ్‌, తదితర విషయాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో భక్తులు వచ్చేందుకు ప్రత్యేకంగా డమ్మీ క్యూలైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై కూలంకషంగా చర్చించారు. కేశఖండన శాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, మున్సిపల్‌ స్కూల్‌ వద్ద తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే స్కూల్‌కు ఆనుకుని ఉన్న రెండున్నర ఎకరాల మున్సిపల్‌ స్థలంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు ఈవో వివరించారు. దేవాలయంలో భక్తులు దర్శనానికి వచ్చి పోయే క్యూలైన్ల మార్గాలను, ప్రసాదాల కౌంటర్లను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంద్రపుష్కరిణి వద్ద గల వైజయంతి కళావేదికను, ఆలయ పరిసర ప్రాంతాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీవోలు సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌, ఇంజినీర్‌ పొగిరి సుగుణాకరరావు, జిల్లా టూరిజం అధికారి కె.నారాయణరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వేడుకలపై నేడు అభిప్రాయ సేకరణ

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జనవరి 1(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నట్టు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఈ మేరకు జడ్పీ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో రథసప్తమి వేడుకలు జరుగనున్న నేపథ్యంలో విలువైన సలహాలు, సూచనలతో పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 11:43 PM