Ekadashi: వైభవంగా.. వైకుంఠ ఏకాదశి
ABN , Publish Date - Jan 11 , 2025 | 12:04 AM
Vaikuntha Ekadashi వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ.. జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శుక్రవారం వైష్ణవ, వెంకటేశ్వర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్వర ద్వార దర్శన కోసం బారులుదీరారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
శ్రీకాకుళం కల్చరల్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ.. జిల్లాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శుక్రవారం వైష్ణవ, వెంకటేశ్వర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్వర ద్వార దర్శన కోసం బారులుదీరారు. శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలో నారాయణ తిరుమల, కల్యాణ వెంకటేశ్వరస్వామి, నానుబాలవారి వీధిలో విజయదుర్గమ్మ, బ్యాంకర్స్ కాలనీలో శివబాలాజీ, పాలకొండ రోడ్డు లోని కోదండరామాలయం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. అలాగే అరసవల్లిలోని ఆదిత్యాలయం, చిన్నబజారు, డీసీసీబీ కాలనీ, అరసవల్లి తోట దారిలో ఉన్న వెంకటేశ్వరాలయాలకు భక్తులకు పోటెత్తారు. ఆయాచోట్ల స్వామివారిని వజ్రకవచాలు, తులసీ దళాలు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీమన్నారాయణ, గోవిందా.. గోవిందా అని నామస్మరణ చేస్తూ భక్తులు పూజలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, పులిహోర, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా దేవదాయశాఖ, కమిటీ సభ్యులు, పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.