Sankranti: సంక్రాంతి శోభ
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:32 PM
Migrants reaching సిక్కోలులో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న వలసజీవులు స్వగ్రామాలకు వస్తున్నారు.
స్వగ్రామాలకు చేరుతున్న వలస జీవులు
రద్దీగా మారుతున్న రైల్వేస్టేషన్లు, కాంప్లెక్స్‌లు
కిటకిటలాడుతున్న మార్కెట్లు
శ్రీకాకుళం కల్చరల్, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సిక్కోలులో సంక్రాంతి సందడి నెలకొంది. పండుగ నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న వలసజీవులు స్వగ్రామాలకు వస్తున్నారు. అలాగే పాఠశాలలకు, కళాశాలలకు కూడా శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించడంతో.. సుదూర ప్రాంతంలో ఉన్న విద్యార్థులంతా ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. మరోవైపు ప్రైవేటు బస్సులు, వాహనాల్లో కూడా అధికంగా రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే మార్కెట్లకు సంక్రాంతి శోభ వచ్చింది. వస్ర్తాలు, బంగారం ఆభరణాలు, కిరాణా సామగ్రి, ఇతర వస్తువుల కొనుగోలు కోసం చాలా మంది శ్రీకాకుళం వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డు, నెహ్రూ బజార్, చిన్నబజార్, పెద్ద మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. నెహ్రూ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఆటోలు, కార్లు వంటి వాహనాలను పరిమిత సమయాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 10 నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ద్విచక్ర వాహనాలు మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు.