Palavalasa: ‘పాలవలస’ కన్నుమూత
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:42 PM
palavalsa death మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాపరిషత్ మాజీచైర్మన్ పాలవలస రాజశేఖరం(77) సోమవారం మృతిచెందారు. కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
అనారోగ్యంతో మాజీ ఎంపీ రాజశేఖరం మృతి
కాంగ్రెస్‌తోనే రాజకీయ ప్రస్థానం
2011లో వైసీపీలో చేరి...
శ్రీకాకుళం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాపరిషత్ మాజీచైర్మన్ పాలవలస రాజశేఖరం(77) సోమవారం మృతిచెందారు. కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇందుమతి, కుమారుడు విక్రాంత్, కుమార్తె శాంతి ఉన్నారు. కుమారుడు పాలవలస విక్రాంత్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కుమార్తె రెడ్డి శాంతి 2019లో వైసీపీ నుంచి పాతపట్నం ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజశేఖరం మృతిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.
పాలవలస రాజశేఖరం రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలోనే అత్యధికంగా సాగింది. రాజశేఖరం స్వగ్రామం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం నీలానగరం. ఈయన తండ్రి పాలవలస సంగంనాయుడు 1962-67 మధ్య ఉనుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజశేఖరం సర్పంచ్ పదవి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా పార్లమెంటు సభ్యుడి స్థాయి వరకు చేరుకున్నారు. నీలానగరం సర్పంచ్‌గా 1970-74 మధ్య పదవి చేపట్టారు. అనంతరం అప్పటి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిలాల పరిషత్తు చైర్మన్‌గా 1974 నుంచి 1976 వరకు పనిచేశారు. ఆతర్వాత 1976లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1992-94 మధ్యకాలంలో శ్రీకాకుళం డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు. 1994లో ఉనుకూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరలా 2006 నుంచి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2011 జూన్‌లో వైసీపీలో చేరారు.