Share News

Intermediate education: ఇంటర్‌ విద్యలో.. సమూల మార్పులు!

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:37 AM

Educational reforms పరీక్షలు.. మార్కులు.. ర్యాంకులు అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.

Intermediate education: ఇంటర్‌ విద్యలో.. సమూల మార్పులు!
పరీక్షలకు సిద్ధమవుతున్న ఇంటర్‌ విద్యార్థులు

  • సీబీఎస్‌ఈకి అనుగుణంగా సిలబస్‌కు సన్నాహాలు

  • కళాశాల స్థాయిలోనే ప్రథమ సంవత్సరం పరీక్షలు

  • రెండో ఏడాదిలో బోర్డు ద్వారా పరీక్షా ఫలితాలు

  • ప్రతిపాదనలపై ఈ నెల 26లోగా అభ్యంతరాల స్వీకరణ

  • నరసన్నపేట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పరీక్షలు.. మార్కులు.. ర్యాంకులు అంటూ విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా ఇంటర్మీడియట్‌ విద్యార్థులపై ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉండడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలో ఎక్కడా ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించడం లేదు. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా ఇంటర్‌ విద్యలో సమూల మార్పులకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలు చేయనున్నట్టు ఇటీవల ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా వెల్లడించారు.

  • జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 38, ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు 71, మోడల్‌ జూనియర్‌ కళాశాలలు -13, కేజీబీవీ కళాశాలలు -25, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలు -9, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ కళాశాల -1, జిల్లాపరిషత్‌ ఫ్లస్‌ 2 కళాశాలలు -6 , మహాత్మ జ్యోతిరావుపూలే మహిళ జూనియర్‌ కళాశాల -1.. మొత్తం 164 కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొదటి సంవత్సరం 20,678 మంది, రెండవ సంవత్సరం 18,792 మంది విద్యార్థులు చదువుతున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్‌ ఇయర్‌లో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల విద్యాశాఖ 2024-25 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టింది. తదనుగుణంగా 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో కూడా ఎన్‌సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను తీసుకురావాల్సి ఉంది. జాతీయస్థాయి పోటీ పరీక్షలైన నీట్‌, జేఈఈ, సీఏలు సిలబస్‌కు అనుగుణంగా ఈ మార్పులు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న మూల్యాంకనాన్ని పరిగణలోకి తీసుకుని.. రాష్ట్రంలో కూడా ఇంటర్‌ మొదటిసంవత్సరం పరీక్షలను బోర్డు నిర్ణయించిన బ్లూప్రింట్‌ ఆధారంగా కళాశాలలో ఇంటర్నల్‌గా నిర్వహిస్తారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలను మాత్రం ప్రస్తుత విధానంలో బోర్డు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తుంది.

  • సీబీఎస్‌ఈ విధానం ఇలా

    ఇంటర్మీడియట్‌ విద్య సీబీఎస్‌ఈ విధానంలోకి మారనుంది. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రెండు భాషలతో పాటు ఆ గ్రూపునకు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. సైన్స్‌ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టులు, ఆర్ట్స్‌కు మూడు సబ్జెక్టుల విధానం ఉంది. ఇప్పుడు ఎంపీసీ విద్యార్థులకు ఉన్న మ్యాథ్స్‌ పేపర్లను ఒకే పేపర్‌గా, బైపీసీ విద్యార్థులకు బోటని, జువాలజీని ఒకే పేపర్‌గా తీసుకొస్తున్నారు.

  • నూతన సబ్జెక్టు కాంబినేషన్లు ఇలా

    ఇంగ్లీష్‌ సబ్జెక్టు అందరికి కచ్చితంగా ఉంటుంది. ద్వితీయ సబ్జెక్టుగా ఏదైనా భాష కానీ లేదా ఇతర గ్రూపునకు చెందిన ప్రధాన సబ్జెక్టుకానీ ఎంపిక చేసుకోవచ్చు. దీని కోసం 23 ఆప్షన్లు ఉంటాయి. అంటే ఎంపీసీ చదివే విద్యార్థులు జువాలజీ, బోటనీ సబ్జెక్టు కానీ ఆర్ట్స్‌ సబ్జెక్టుగాని తీసుకోవచ్చు. మూడు, నాలుగు, ఐదో సబ్జెక్టులు ఎంపిక చేసుకున్న గ్రూపు సబ్జెక్టులు ఉంటాయి. ఐచ్ఛికంగా 6వ సబ్జెక్టు ఉంటుంది. దీనికి కూడా భాష లేదా ఇతర గ్రూపునకు చెందిన 23 ఆప్షన్ల నుంచి ప్రధాన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రధానంగా ఎంచుకున్న ఐదు సబ్జెక్టులలో ఒకటి తప్పితే, ఆప్షన్‌ సబ్జెక్టు పాసైతే దానిని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఉత్తీర్ణత చేస్తారు. ఈ విధానం అమలవ్వాంటే ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో ఇంగ్లీష్‌ తప్పనిసరిగా ఉండాలి

  • మార్కులు ఇలా

    ఇప్పటివరకు ప్రథమ సంవత్సరంలో 500 మార్కులకు, ద్వితీయ సంవత్సరంలో 500 మార్కులకు పరీక్షలు జరుగుతున్నాయి. నూతన విధానంలో మార్కులు అదే మాదిరి ఉన్నా, ఉత్తీర్ణత శాతం కోసం ప్రథమ సంవత్సరం మార్కులు పరిగణనలోకి తీసుకోరు. ద్వితీయ సంవత్సరం మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణత శాతం కేటాయిస్తారు. ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకీ అంతర్గత మార్కులు ఉంటాయి. ఆర్ట్స్‌ గ్రూప్‌లో ఇంగ్లీష్‌తో పాటు ఎంచుకున్న సబ్జెక్టుకు థియరీ మార్కులు 80, ఇంటర్నర్‌ మార్కులు 20 ఉంటాయి. సైన్స్‌ సబ్జెక్టులో థియరీ 70 మార్కులు, ఇంటర్నల్‌ 30 మార్కులు ఉంటాయి. ప్రశ్నాపత్రాల్లో ఒక మార్కు, 5,6 మార్కుల ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

  • పాఠ్యపుస్తకాలలో మార్పులు ఇలా

    మొదటి సంవత్సరం సైన్స్‌ సబ్జెక్టులలో గణితం, ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర, బోటనీ, జువాలజీలలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనున్నారు. రెండో సంవత్సరం ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అనుసరించి అమలులో ఉన్న సిలబస్‌ను తగ్గించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో రెండో సంవత్సరం సైన్స్‌ గ్రూపులోని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. మొదటి సంవత్సర ఆర్ట్స్‌ గ్రూపులలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ఉన్నత విద్యా మండలి సిలబస్‌కు అనుగుణంగా రూపొందించిన పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. సెకండియర్‌లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తారు. 2026-27 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ ఉన్నత విద్యామండలి సిలబస్‌ పుస్తకాలను అందించనున్నారు. ఇక లాంగ్వేజస్‌ (ఇంగ్లీష్‌, తెలుగు, హిందీ, సంస్కృతం, ఒరియా) మొదటి సంవత్సరం ఇంటర్‌ విద్యామండలి పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. ఇవన్నీ ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు మాత్రమే. ఈ మార్పులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈనెల 26లోగా ‘బీఐఈఆర్‌ఈఎఫ్‌ఓఆర్‌ఎంఎస్‌ ఎట్‌ది రీటాఆఫ్‌ జి.మెయిల్‌ డాట్‌ కమ్‌’ మెయిల్‌కు పంపాలని ఇంటర్‌బోర్డు అఽధికారులు ఆదేశాలు జారీచేశారు.

  • ప్రక్షాళన అవసరం

    మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటర్‌ విద్యలో ప్రక్షాళన అవసరం. సైన్సు విద్యార్థులకు జాతీయస్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు సీబీఎస్‌ఈ విధానం ఎంతో దోహదం చేస్తుంది. కార్పొరేట్‌ కళాశాల విద్యార్థులకు పరిమితమయ్యే నీట్‌, జేఈఈలు ప్రభుత్వ కళాశాలలో చదివే వారికి కూడా ఈ విధానం ద్వారా దోహద పడుతుంది.

    - కింతలి సత్యనారాయణ, రిటైర్డ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌

    ...................

  • ఆర్ట్స్‌ సిలబస్‌లో కూడా..

    సీబీఎస్‌ఈ విధానం తీసుకురావడం మంచిదే. ఆర్ట్స్‌ చదివే విద్యార్థులు అంటే చులకన లేకుండా ఇంటర్‌ స్థాయి నుంచి సీఏ, యూపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలకు పోటీ పడే విధంగా కరిక్యూలమ్‌ రూపొందించాలి. సీబీఎస్‌ఈ విధానంతో ఆర్ట్స్‌ సబ్జెక్టులకు ఆదరణ పెరుగుతుంది.

    - ఎంఆర్‌ జ్యోతిఫెడరిక్‌, రిటైర్డ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

    ......................

  • ప్రతిపాదనలు చేపట్టింది

    సీబీఎస్‌ఈ విధానంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌ విద్యలో మార్పులకు ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనలు రూపొందించింది. ఈనెల 26లోగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే తల్లిదండ్రులు, విద్యావేత్తలు పంపించవచ్చును. కొత్తవిధానంపై కసరత్తు జరుగుతోంది.

    - దుర్గారావు, ఆర్‌ఐవో, ఇంటర్‌ విద్య

Updated Date - Jan 20 , 2025 | 12:37 AM