alcohol was drunk!:రూ.5.46కోట్ల మద్యం తాగేశారు!
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:35 PM
alcohol was drunk!: నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. మంగళవారం ఒక్కరోజే రూ.5.46 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
- 2,621 కేసుల బీర్లు ఉఫ్
- గతం కంటే కొనుగోలు పెరిగినా తగ్గిన ఆదాయం
శ్రీకాకుళం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. మంగళవారం ఒక్కరోజే రూ.5.46 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన విక్రయాలు అర్ధరాత్రి వరకూ సాగాయి. మద్యం దుకాణాలకు, బార్లకు అర్ధరాత్రి వరకూ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో లిక్కరు, బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అయితే గతేడాదితో పోల్చితే ఈ దఫా ఆదాయం కాస్త తగ్గింది.
6,984 కేసుల విక్రయం
జిల్లా వ్యాప్తంగా మంగళవారం 6,984 కేసుల ఐఎంఎల్(వైన్) విక్రయం జరిగింది. 2,621 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాది డిసెంబరు 31 (2023)తో పోల్చితే విక్రయాలు భారీగా పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. గతేడాది జిల్లాలో 5,597 కేసుల ఐఎంఎల్ మద్యం, 2,329 కేసుల బీర్లు విక్రయం జరిగింది. వాటి ద్వారా రూ.5,12,21,367 ఆదాయం సమకూరింది. విక్రయించిన మద్యం కేసులు తక్కువే అయినప్పటికీ ధర ఎక్కువ కారణంగా అంతటి ఆదాయం వచ్చింది.
అయితే, ఈ దఫా విక్రయాలు పెరిగినా ధర తక్కువ కారణంగా ఆదాయం తగ్గుముఖం పట్టింది. జగన్ సర్కారు కాలంలో చిత్రవిచిత్రమైన బ్రాండ్లపేరుతో మద్యం విక్రయించిన విషయం తెలిసిందే. మద్యం నాణ్యత తక్కువ ధర ఎక్కువగా ఉండేది. అప్పట్లో కనిష్టంగా చీఫ్ లిక్కర్ రూ.130 పైబడే ఉండేది. అందువల్ల విక్రయాలు తక్కువగా ఉన్నా ఆదాయం ఎక్కువగా ఉండేది. అయితే ఎన్నికల హామీల్లో ‘నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడమే కాకుండా.. ధరలను కూడా నియంత్రిస్తామని’ మాట ఇచ్చారు చంద్రబాబు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేశారు. రూ.99కే క్వార్టర్ మద్యం తీసుకువచ్చింది. దీంతో అమాంతం గిరాకీ పెరిగింది. కొత్తసంవత్సరం వేళ రూ.99కే క్వార్టర్ లభ్యం కావడంతో మందుబాబులు తెగ సంబరపడిపోయి.. డబుల్.. త్రిపుల్‌గా తీసేసుకుని తెగ తాగారు. ధర తగ్గడంతో 2023 డిసెంబరు 31తో పోల్చితే ఈదఫా రూ.11,75,103 ఆదాయం తగ్గింది.