Sankranti: సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 13 , 2025 | 12:05 AM
harvest festival జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. అన్ని పండుగలు కన్నా.. సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. కాలగమనంలో ఎన్నిమార్పులు వచ్చినా సంక్రాంతి శోభ మాత్రం మసకబారదు. ముంగిట్లో భోగిమంట.. వాకిట్లో ముగ్గులు.. రైతన్నల లోగిళ్లలో ధాన్యపురాశులు .. పసుపు కుంకములు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్తనలు.. జంగమ దేవర దీవెనలు.. గంగిరెద్దులు, పిండివంటలు ఘమఘములు... పేకాటలు.. పిల్లలు కేరింతలు.. ఇవన్నీ సంక్రాంతి పండుగలో చోటుచేసుకునే దృశ్యాలు.
కళకళలాడుతున్న గ్రామాలు
జనసంద్రంగా ప్రధాన రహదారులు, కూడళ్లు
నరసన్నపేట/ పలాస/ ఆమదాలవలస, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. అన్ని పండుగలు కన్నా.. సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. కాలగమనంలో ఎన్నిమార్పులు వచ్చినా సంక్రాంతి శోభ మాత్రం మసకబారదు. ముంగిట్లో భోగిమంట.. వాకిట్లో ముగ్గులు.. రైతన్నల లోగిళ్లలో ధాన్యపురాశులు .. పసుపు కుంకములు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్తనలు.. జంగమ దేవర దీవెనలు.. గంగిరెద్దులు, పిండివంటలు ఘమఘములు... పేకాటలు.. పిల్లలు కేరింతలు.. ఇవన్నీ సంక్రాంతి పండుగలో చోటుచేసుకునే దృశ్యాలు. ప్రధానంగా పల్లెల్లో సంక్రాంతి సంబరాలే వేరు. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వలస జీవులు ఎక్కడ ఉన్నా.. సంక్రాంతిని పురస్కరించుకునేందుకు స్వగ్రామాలకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులతో సరదాగా గడుపుతారు. తొలిరోజు భోగిమంటలు వేసి కొత్త జీవితాలకు శ్రీకారం చుడతారు. రెండో రోజు పితృదేవతలకు పూజిస్తారు. మూడో రోజు పశువులకు శుభాకాంక్షలు చెప్పే కనుము, మరుసటి రోజున చిన్నపిల్లలు పండుగగా జరుపుకునే ముక్కకనుముతో సంక్రాంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఇప్పటికే వలసజీవులు స్వగ్రామాలకు చేరుకోగా.. పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కెట్లు జనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి.
నేడు భోగి
పండుగ మూడు రోజుల్లో మొదటిది భోగి. సోమవారం భోగి పండుగను జరుపుకొనేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. వేకువజామునే భోగి మంటలు వేసి.. భోగభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని ప్రజలంతా కోరుతుంటారు. ఇంట్లో ఉన్న పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన వస్తువులు మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని వేడుకుంటారు. కొన్ని ఇళ్లలో ఇదే రోజున పిల్లలు, పెద్దలు కొత్త దుస్తులు ధరిస్తారు. భోగి పండ్లు పిల్లల తలపై పోస్తారు. దీనివల్ల పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుందని గ్రామీణుల నమ్మకం. అలాగే మంగళవారం సంక్రాంతి పండుగ చేసుకోనున్నారు. ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుణ్యకాలం ఉందని పండితులు తెలిపారు. అలాగే బుధవారం నాడు కనుమ పండుగ చేసుకోనున్నారు. ఆ రోజున రైతులు పశువులను పూజిస్తారు. 16న ముక్కనుమ నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం చిన్నారులకు చెవులు, ముక్కు కుట్టడం వంటివి చేస్తారు.
ప్రయాణికుల రద్దీ
సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఆదివారం పలాస, ఆమదాలవలస రైల్వేస్టేషన్లు(శ్రీకాకుళం రోడ్డు), శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు తదితర బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. పలాసలో ఉదయం సికింద్రాబాద్ నుంచి వచ్చిన ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైలులో వందల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకున్నారు. పలాస, టెక్కలి డివిజన్లకు సంబంధించి వలస కూలీలు ఎక్కువగా సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నారు. వారంతా సొంత గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి భారీ సంఖ్యలో తరలిరావడంతో రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం వచ్చిన విశాఖ, హౌరామెయిల్‌లో కూడా సాధారణ రోజుల కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు తరలివచ్చారు. అలాగే ఆమదాలవలస రైల్వేస్టేషన్ కూడా చెన్నై, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. రైల్వేస్టేషన్ల నుంచి ఆటోలు, కారులు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో స్వగ్రామాలకు చేరుకున్నారు. వాహనాల రాకపోకలు అధికమవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.