Share News

Bhogi: ఆ గ్రామాలు.. భోగికి దూరం

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:37 PM

villages are far from Bhogi సంక్రాంతి వచ్చిందంటే.. ఊరూవాడా సందడే సందడి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను మూడురోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు జరుపుకొంటారు. భోగి రోజు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. కాగా.. జిల్లాలో కొన్ని గ్రామాలు మాత్రం వివిధ కారణాలతో తరతరాలుగా భోగికి దూరంగా ఉంటున్నాయి.

Bhogi: ఆ గ్రామాలు.. భోగికి దూరం
భోగి పండుగ చేసుకోని చింతువానిపేట, లింగాలవలస, బూరవిల్లి గ్రామాలు

  • తరతరాలుగా.. కొనసాగుతున్న ఆచారం

  • పండుగ ముందు శనివారమే బసివలసలో సంక్రాంతి

  • నరసన్నపేట/ జలుమూరు/గార, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వచ్చిందంటే.. ఊరూవాడా సందడే సందడి. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను మూడురోజుల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు జరుపుకొంటారు. భోగి రోజు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. కాగా.. జిల్లాలో కొన్ని గ్రామాలు మాత్రం వివిధ కారణాలతో తరతరాలుగా భోగికి దూరంగా ఉంటున్నాయి.

  • నరసన్నపేట మండలంలో బసివలస, చింతువానిపేట, సుందరాపురం, గోకయ్యవలస, చోడవరం గ్రామాల్లో కొన్ని తరాల నుంచి భోగి పండుగను జరుపుకోవడం లేదు. బసివలస, చింతువానిపేట గ్రామాల్లో 150 సంవత్సరాలకు ముందు.. భోగి రోజు కొట్లాట జరిగి కొంతమంది మృతి చెందారు. అప్పటి నుంచీ భోగి పండుగను జరుపుకోరాదని ఆనాడు పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచీ ఆ పెద్దల నిర్ణయాన్ని గౌరవిస్తూ.. గ్రామస్థులు నేటికీ భోగి మంటలు వేయడం లేదు. అలాగే బసివలసలో సంక్రాంతి రోజు కూడా ఎవరూ పెద్దలను పూజించరు. సంక్రాంతికి ముందు వచ్చే శనివారం పెద్దలకు పూజిస్తారు. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే తమ పూర్వీకులు ఎవరూ భోగి మంటలు వేయలేదని, ఆ ఆచారాన్ని తాము కూడా పాటిస్తున్నామని సుందరాపురం గ్రామస్థులు తెలిపారు.

  • లింగాలవలసలో.. పులి దాడి చేసిందని..

    జలుమూరు మండలం లింగాలవలస గ్రామస్థులు కూడా తరతరాలుగా భోగి పండుగకు దూరంగా ఉంటున్నారు. ఈ గ్రామంలో 500కుపైగా ఇళ్లు ఉన్నాయి. ఇళ్లకు వచ్చే చుట్టాలు, బంధువులు సంతోషంగా గడిపి పండగ వాతావరణం ఉన్నా.. ఈ గ్రామంలో మాత్రం భోగి మంట వేయరు. సుమారు వందేళ్ల కిందట లింగాలవలసలో వేకువజామున భోగి మంట వేసిన యువకుడిపై పులి దాడి చేసి చంపేసిందని.. అప్పటి నుంచీ తాము భోగి మంట వేయడం లేదని గ్రామస్థులు తెలిపారు. పూర్వీకుల ఆచారాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

  • బూరవిల్లిలోనూ..

    గార మండలం బూరవిల్లి గ్రామస్థులు కూడా భోగి పండుగను జరుపుకోరు. పండుగ నేపథ్యంలో దూరప్రాంతంలో ఉపాధి పొందుతున్న వలసజీవులు స్వగ్రామానికి చేరుకుంటారు. అలాగే ఆడపిల్లలు, అల్లుళ్లు, బంధువులు వస్తారు. కొత్త వస్ర్తాలు ధరిస్తారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అందరిలాగే ఘనంగా జరుపుకొంటారు. కానీ భోగి మంట మాత్రం వేయరు. పెద్దలు కాలం నుంచీ ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే ఈ గ్రామంలో ఉగాది రోజు రైతులు ఏరువాక పూజ చేయరు. తర్వాత మరో రోజు ప్రత్యేకంగా ఏరువాక చేస్తారు. నాగులచవితి కూడా షష్టి రోజు చేస్తారు. దీపావళి, దసరా రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

  • సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం

    గ్రామంలో పూర్వీకులు ఆచరించిన ఆచారం, సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నాం. భోగీ మంట గ్రామంలో వేస్తే వేసిన వారికి ఏదో ఒక నష్టం సంభవిస్తుందని భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే గ్రామంలో ఎవరూ భోగి మంట వేయకుండా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.

    - దుంగ స్వామిబాబు, మాజీ సర్పంచ్‌, లింగాలవలస, జలుమూరు

    .......................

  • సరదాగా గడుపుతాం

    భోగిరోజున కుటుంబ సభ్యులమంతా సరదాగా గడుపుతాం. భోగిమంట మాత్రం వేయం. మా పూర్వీకుల నుంచీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఒకప్పుడు ఒక వీధిగా ఉన్న లింగాలవలసలో ప్రస్తుతం ఆరు వీధులైనా.. ఎక్కడా భోగి మంట వేయం.

  • - పంచిరెడ్డి అప్పలస్వామి, వృద్దుడు, లింగాలవలస, జలుమూరు

    .......................

  • సంప్రదాయాన్ని పాటిస్తున్నాం

    తరతరాలుగా వస్తున్న సంప్రదాయం మేరకు భోగి మంటలు వేసుకోవడం లేదు. పూర్వం గ్రామంలో భోగి రోజున తగాదాల కారణంగా భోగి మంటలు వేయలేదు. నాటి నుంచి ఈ ఆచారం కొనసాగిస్తున్నాం.

    - సురంగి నర్సంగరావు, చింతువానిపేట, నరసన్నపేట

    ......................

  • ముందే సంక్రాంతి

    మా గ్రామంలో భోగి మంటలు వేయం. సంక్రాంతికి ముందుగా వచ్చే శనివారం నాడు గ్రామంలో పెద్దలకు పూజిస్తాం. మిగతా గ్రామాల కంటే ముందే మా గ్రామంలో సంక్రాంతి జరుపుకొంటాం. గ్రామ ఆచారం మేరకు ఇప్పటికీ ఆ పద్ధతి కొనసాగిస్తున్నాం.

    - రెడ్డి గోవిందరావు, బసివలస, నరసన్నపేట

    .......................

  • సంప్రదాయంగా వస్తోంది

    మా గ్రామంలో భోగి పండగ రోజున భోగిమంట వేయకపోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. తాతముత్తాతల కాలంనాటి నుంచి ఇదే కొనసాగుతోంది. నాగుల చవితిని కూడా అందిరిలా కాకుండా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు నిర్వహిస్తాం.

    - ఆరవెల్లి సీతారామస్వామి, గ్రామ పురోహితులు, బూరవిల్లి, గార

    .......................

  • మా గ్రామానికి ప్రత్యేకత

    మా గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాది పొడుగునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. పెద్దల కాలం నుంచి కూడా ఈ గ్రామంలో భోగి పండుగ నిర్వహించడం లేదు.

    - మళ్ళ నర్సునాయుడు, బూరవిల్లి, గార


buravelli.gif

Updated Date - Jan 11 , 2025 | 11:38 PM