PACS electionsపీఏసీఎస్ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఆగాల్సిందే
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:40 PM
PACS elections: పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు వారు కొనసాగాలని చెప్పింది. అలాగే, త్రీమెన్ కమిటీలను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
- త్రీమెన్ కమిటీలను నియమించాలనే యోచన
- జూన్‌లో పూర్తిస్థాయి ఎన్నికలు?
ఇచ్ఛాపురం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు వారు కొనసాగాలని చెప్పింది. అలాగే, త్రీమెన్ కమిటీలను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పీఏసీఎస్ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు సేవలు అందించడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) కీలక పాత్ర పోషిస్తాయి. రైతులకు పంట రుణాలు మంజూరు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడంతో పాటు ఇతర సేవలు అందిస్తుంటాయి.
కానీ, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పీఏసీఎస్‌లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతులకు సేవలందించాల్సింది పోయి వ్యాపార ధోరణిలోకి మారాయి. అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పీఏసీఎస్‌లకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. త్రీమెన్ కమిటీ సభ్యులను నియమించడంతో పాటు జూన్‌లోగా ఎన్నికలు పూర్తిచేయాలని నిర్ణయించింది. నీటి సంఘాల మాదిరిగానే ఎన్నికలు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఉంది. అలాగే, పూర్తి డిజిటలైజేషన్ చేసి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను రైతుసేవల్లోకి మార్చాలని చూస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో 42 పీఏసీఎస్‌లు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో సహకార బ్యాంక్ ఉంది. అలాగే, 25 బ్రాంచ్‌లు కొనసాగుతున్నాయి. మరో 11 ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే జిల్లా నుంచి పాలకొండ, రాజాం నియోజకవర్గాలు వేరుపడ్డాయి. కానీ, ఇంతవరకూ వాటి విభజన జరగలేదు. గత ఏడేళ్లుగా పీఏసీఎస్ కార్యవర్గాలకు ఎన్నిక జరగలేదు. చివరిసారిగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో ఎన్నికలు జరిగాయి. 2018తో వీరి పదవీకాలం ముగిసింది. కానీ, అప్పటికే సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో నాడు చంద్రబాబు సర్కారు పాత కార్యవర్గాలనే కొనసాగించింది.
కానీ, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం త్రిసభ్య కమిటీతో తన పార్టీ ప్రతినిధులను నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఈ ఐదేళ్ల కాలం సొంత పార్టీ నేతలను నామినేట్ చేసి కాలం వెళ్లదీసింది. కనీసం ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన కూడా చేయలేదు. దీంతో రైతులకు సహకార సేవలు అందని ద్రాక్షగా మారాయి. పీఏసీఎస్‌ల్లో 50 శాతం వాటాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై రైతులతో పాటు పీఏసీఎస్ ఉద్యోగులు, సిబ్బంది నుంచి నిరసన వ్యక్తం కావడంతో వెనక్కితగ్గింది.
వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో రైతుల సభ్యత్వం తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం రూ.10 నుంచి ఏకంగా రూ.300కు పెరిగింది. కార్యవర్గాల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలకు మించి ఖర్చుగా మారాయి. ఫలితంగా అవినీతి కూడా పెరిగింది. తాజాగా, జి.సిగడాం పీఏసీఎస్‌లో భారీ అవినీతి బయటపడింది. వైసీపీ శ్రేణులకు రుణాలు, బినామీల పేరిట రాయితీలు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
గడువులోగా..
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీలను రద్దుచేస్తూ కూటమి ప్రభుత్వం గతేడాది జూన్ 27న ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. పీఏసీఎస్‌లకు ఆరు నెలల పాటు తాత్కాలికంగా పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది. ఈలోగా ప్రభుత్వం ఎన్నికలకు వెళుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. తాజాగా, మరో ఆరు నెలల పాటు పర్సన్ ఇన్‌చార్జిలను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆశావహులు నిరాశలో మునిగిపోయారు.
ఎన్నికల కోసం మరో ఆరు నెలలు ఆగాల్సిందేనని నెట్టూరుస్తున్నారు. అయితే, వైసీపీ సర్కారు మాదిరిగా త్రీమెన్ కమిటీలను నియమించాలన్న ప్రతిపాదన ఉంది. ఇంతలోనే ఈ ఏడాది జూన్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక నుంచి నిర్ణీత గడువులోగా ఎన్నికలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, డీసీసీబీతో పాటు డీసీఎంఎస్‌కు పర్సన్ ఇన్‌చార్జిగా జాయింట్ కలెక్టర్ మరో ఆరు నెలలు కొనసాగనున్నారు.
ఎన్నికలకు కసరత్తు
వ్యవసాయ పరపతి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని సాంకేతిక కారణాలతో అది సాధ్యం కావడం లేదు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు త్రీమెన్ కమిటీలను ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది.
-నగిస్, జిల్లా సహకార శాఖ అధికారి, శ్రీకాకుళం