Share News

CM Chandrababu: నీటి ఎద్దడిని ఎదుర్కొందాం!

ABN , Publish Date - Mar 25 , 2025 | 05:02 AM

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. పశువుల కోసం నీటి తొట్ల నిర్మాణం, పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, ఉపాధి పథకాల్లో నీటి కుంటల నిర్మాణం తదితర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

CM Chandrababu: నీటి ఎద్దడిని ఎదుర్కొందాం!

  • పక్కా ప్రణాళికతో ముందుకెళ్దాం.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ‘వేసవి ప్రణాళిక’పై సోమవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా.. పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్‌ అలెర్టుల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. జన సమూహం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారికి ప్రభుత్వపరంగా సహకరించాలన్నారు. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం కొరతతోపాటు పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. ఇక, పాఠశాలల్లో విద్యార్థులకు ‘వాటర్‌ బెల్‌’ విధానం అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా ఆయా స్కూళ్లలో తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండే పరిశ్రమల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.


మునిసిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి రూ.39 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. గ్రామాల్లో ఉపాధి పథకం కింద నీటి కుంటల నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ఉపాధి కూలీలకు అదనపు పనిదినాలు కల్పించి, వారికి పని ప్రాంతాల్లో నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటలలోపు కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరేలా చూడాలన్నారు. మున్సిపల్‌ కార్మికులకు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటలలోపు బహిరంగ ప్రాంతాల్లో పనులు అప్పగించొద్దన్నారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 05:02 AM