Swiggy Delivery Boy : ‘బ్రో’ అన్నాడని బాదేశాడు
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:52 AM
‘బ్రో’ అని సంబోధించాడనే కోపంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ ఫ్లాట్ యజమాని విచక్షణారహితంగా దాడి చేసిన దారుణ ఘటన విశాఖపట్నంలో జరిగింది.

స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఫ్లాట్ యజమాని దాడి
అపార్టుమెంట్ సెక్యూరిటీతో చితకబాదించి.. అండర్‌వేర్‌తో గేటు బయట నిలబెట్టి దాష్టీకం
అపార్టుమెంట్ వద్ద ఆందోళనకు దిగిన డెలీవరీ బాయ్స్.. విశాఖపట్నంలో ఘటన
విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ‘బ్రో’ అని సంబోధించాడనే కోపంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ ఫ్లాట్ యజమాని విచక్షణారహితంగా దాడి చేసిన దారుణ ఘటన విశాఖపట్నంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అపార్టుమెంట్ వద్ద డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు తెలిపిన వివరాల మేరకు.. సీతమ్మధారలో ఆక్సిజన్ టవర్స్ ‘బి’ బ్లాక్, 29వ అంతస్థులోని 2914 ఫ్లాట్‌లో ఉంటున్న ప్రసాద్ శుక్రవారం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న అనిల్ ఆ ఫుడ్ పార్శిల్ తీసుకుని మధ్యాహ్నం సమయంలో ప్రసాద్ ఫ్లాట్‌కు వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టగానే ఓ మహిళ వచ్చారు. అనిల్ మాటలు ఆమెకు అర్థం కాకపోవడంతో, ఇంట్లోకి వెళ్లి ప్రసాద్‌కు చెప్పారు. ప్రసాద్ బయటకు వచ్చి ఏంటని అడిగేసరికి ‘మీకు ఫుడ్ పార్శిల్ వచ్చింది బ్రో’ అని అనిల్ సమాధానం ఇచ్చాడు. సార్ అని కాకుండా బ్రో అని సంబోధిస్తావా? అంటూ అతనిపై ప్రసాద్ దాడి చేశారు. అనంతరం కిందకు తీసుకువెళ్లి సెక్యూరిటీ సహాయంతో మరోసారి కొట్టించారు. తర్వాత బట్టలు విప్పించి అండర్‌వేర్‌తో గేటు బయట నిలబెట్టారు. క్షమించాలని కోరుతూ అనిల్‌తో బలవంతంగా ఒక లేఖ రాయించుకుని విడిచిపెట్టారు.
ఈ అవమానం తట్టుకోలేక అనిల్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం శనివారం సాయంత్రం మొదలైంది. దీంతో నగరంలోని ఫుడ్ డెలివరీ బాయ్స్ అంతా ఆక్సిజన్ టవర్స్ వద్దకు చేరుకున్నారు. అనిల్‌పై దాడి చేసి, అవమానపరిచి, ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. దీంతో విశాఖ ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనిల్‌కు ఫోన్ చేశారు. అతను క్షేమంగానే ఉన్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. ఇదే విషయాన్ని ఆందోళన చేస్తున్నవారికి వివరించారు. బాధితుడు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.