MLA Jayasurya : ‘సాక్షి’పై ప్రివిలేజ్
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:26 AM
జరగని శిక్షణ తరగతులకు కోట్లు ఖర్చు చేయడం ఎలా సాధ్యమని అధికార టీడీపీ సభ్యుడు గిత్తా జయసూర్య ప్రశ్నించారు. జగన్ పత్రికపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు.

ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వకుండానే కోట్లు ఖర్చంటూ తప్పుడు వార్తలతో సభ పరువు తీసిన జగన్ పత్రిక
చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే జయసూర్య
ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన స్పీకర్
ఎమ్మెల్సీ కోడ్ వల్లే కార్యక్రమం వాయిదా..
అసత్య వార్తలు బాధ కలిగించాయి : అయ్యన్న
అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మొదటిసారి ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల కోసం చేసిన ముందస్తు ఏర్పాట్లలో రూ.కోట్లు వృధా చేశారంటూ కథనం ప్రచురించిన ‘సాక్షి’ తీరు మంగళవారం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. జరగని శిక్షణ తరగతులకు కోట్లు ఖర్చు చేయడం ఎలా సాధ్యమని అధికార టీడీపీ సభ్యుడు గిత్తా జయసూర్య ప్రశ్నించారు. జగన్ పత్రికపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఆ వినతిని పరిగణనలోకి తీసుకున్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ అంశాన్ని సభాహక్కుల సంఘానికి (ప్రివిలేజ్ కమిటీ) ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. సంఘం విచారణ తర్వాత చేసే సిఫారసు మేరకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 84 మంది మొదటి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సభలో ప్రజా సమస్యల ప్రస్తావన, పాటించాల్సిన నియమాలు, నిబంధనలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22, 23న శిక్షణ తరగతులు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలపడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులను ఆహ్వానించాలని అనుకున్నారు. వేదికగా విజయవాడను ఎంచుకున్నారు. అయితే రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ విషయమై జగన్ రోత పత్రికలో ‘కోట్లు ఖర్చు.. శిక్షణ తుస్సు..’ శీర్షికన ఈ నెల 22న వార్త ప్రచురించారు. అవగాహనలేని శాసన సభ నవ్వుల పాలైందని... అతిథుల కోసం హోటళ్లలో గదులు బుక్ చేసి శాలువాలు, జ్ఞాపికలు కొనుగోలుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే జయసూర్య సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
సమగ్ర విచారణ జరిపించాలి: కూన రవి
అప్పులు, అరాచకాలతో రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు ధ్వంసం చేసి వనరులతోపాటు రాష్ట్ర ఆదాయాన్నీ దోచేసిన వైసీపీ అవినీతిపై కూలంకషంగా విచారణ జరిపించాలని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా సోమవారం వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని దోచేసి అభివృద్ధి పూర్తిగా విస్మరించిన వైసీపీకి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. స్వార్థం తప్ప ప్రజల కోసం పనిచెయ్యని వైసీపీని అధికారం నుంచి ప్రజలే విసిరి పారేశారని, ఐదేళ్ల పాటు నడిచిన మాఫియా రాజ్యానికి సమాధి కట్టేశారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాజిక పెన్షనర్ల వరకూ అందరూ ఒకటో తేదీ చేతికి డబ్బు తీసుకుని హాయిగా జీవిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు శ్రమిస్తోందన్నారు. ఐదేళ్ల అరాచకపాలన అంతమై కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యాఖ్యానించారు.