Share News

Tirupati: ఏమిటిది స్వామి...

ABN , Publish Date - Jan 09 , 2025 | 09:14 AM

వైకుంఠ ద్వార దర్శనంతో పుణ్యం దక్కుతుందనే ఆశ వారి ప్రాణాలు తీసింది. టీటీడీ(TTD) చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర సంఘటనకు దారి తీసింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు మున్సిపల్‌ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది.

Tirupati: ఏమిటిది స్వామి...

- భక్తుల ప్రాణాలు తీసిన ఆశ... ఆత్రుత

- ఆరుగురి దుర్మరణం

- మృతుల్లో ఐదుగురు మహిళలు

- స్విమ్స్‌, రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

- రుయాలో నలుగురి పరిస్థితి ఆందోళనకరం

- ప్రాణాలు తీసిన బైరాగిపట్టెడ కేంద్రం

(తిరుపతి, ఆంధ్రజ్యోతి)

వైకుంఠ ద్వార దర్శనంతో పుణ్యం దక్కుతుందనే ఆశ వారి ప్రాణాలు తీసింది. టీటీడీ(TTD) చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర సంఘటనకు దారి తీసింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు మున్సిపల్‌ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. వీరిలో ఐదుగురు మహిళలు. మధ్యాహ్నానికే తిరుపతిలోని ఎనిమిది టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచీ ఏపీ, తెలంగాణలలోని అనేక ప్రాంతాల నుంచీ అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చారు. నీళ్ళు, తిండి అని కూడా చూసుకోకుండా కేంద్రాల బయట ఎదురుచూశారు.

ఈ వార్తను కూడా చదవండి: తిరుపతి ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి.. ఆవేదన..


గురువారం తెల్లవారుజామున ఐదింటికి టోకెన్ల జారీ అని ప్రకటించిన టీటీడీ రద్దీ పరిస్థితిని చూసి అర్ధరాత్రి పన్నెండింటి నుంచే టోకెన్లు జారీ చేయాలని భావించింది. తొమ్మిదింటి నుంచీ క్యూలైన్లలోకి భక్తులను అనుమతించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించడానికి పోటెత్తారు. బైరాగిపట్టెడ కేంద్రం పక్కనే పార్కులో వేచి వున్న భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించడానికి గేటు వద్దకు తోసుకువచ్చారు. రాత్రి 8.50 గంటల సమయంలో మూసివున్న గేటును భక్తు లు నెట్టుకుంటూ రావడంతో గేటు ఒక్కసారిగా తెరుచుకోవడంతో నియంత్రణ కోల్పోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు తొక్కుకుంటూ క్యూలైన్ల వైపు పరుగులు తీశారు.

ttd1.2.jpg


కిందపడిపోయిన భక్తుల ఆర్తనాదాలు, హాహాకారాలతో బైరాగిపట్టెడ హోరెత్తిపోయింది. ఈ కేంద్రం వద్ద భద్రతకు నియమించిన పోలీసు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది ఉప్పెనలా దూసుకొచ్చిన భక్తులను అదుపు చేయలేకపోయారు. తోపులాటలో ఊపిరాడక అనేక మంది మహిళలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఫోన్లు చేసి అంబులెన్సులు వచ్చేలోగా పోలీసు సిబ్బంది, స్థానికులు పడిపోయిన భక్తులకు సపర్యలు చేసే ప్రయత్నం చేశారు. కొందరికి సీపీఆర్‌ కూడా చేశారు. సరైన శిక్షణ లేకుండా సీపీఆర్‌ చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్‌ అయ్యాయి


గాయపడినవారిని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ మొదలు పెట్టే సమయానికే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ తర్వాత యధా ప్రకారం బైరాగి పట్టెడ కేంద్రంలో కూడా టోకెన్ల జారీ కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి వైకుంఠ ఏకాదశి రోజుకు సంబంధించిన 38 వేల టోకెన్ల జారీ పూర్తయింది. 12.30 గంటల సమయానికి వైకుంఠ ద్వాదశికి సంబంధించిన టోకెన్లలో 4500టోకెన్లు పంపిణీ చేశారు. తిరుపతిలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎస్‌ విజయా నంద్‌కు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ నివేదిక పంపినట్లు తెలిసింది.

ttd1.jpg


ttd1.3.jpg

భక్తులు పెద్ద ఎత్తున రావడంతోనే..

వైకుంఠ ద్వార దర్శనానికి గురువారం ఉదయం 5గంటలకు జారీచేసే టోకన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఘటనకు సంబంధించి వివరాలను ఎస్పీ ద్వారా తెలుసుకున్నా. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించా, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించా.

- ఆరణి శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి


చికిత్స పొందుతున్న 34మంది

ఈ ఘటనలో మొత్తం 40 మంది గాయపడినట్టు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. వీరిలో రుయాస్పత్రికి 28మందిని తరలించగా నలుగురు మృతి చెందారని, స్విమ్స్‌కు 12 మంది తరలించగా ఇద్దరు మృతి చెందినట్టు చెప్పారు. బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. మృతిచెందిన ఆరుగురులో ఐదుమంది మహిళలు ఉండగా ఒకరు మాత్రమే పురుషుడు అని చెప్పారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

రుయా, స్విమ్స్‌కు క్యూ కట్టిన అంబులెన్సులు


మృత్యువాత పడడంతో పాటు 20 మందికిపైగా అస్వస్థత, గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం ఎస్వీఆర్‌ రుయా, స్విమ్స్‌ ఆస్పత్రికి. తరలించడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఒకదాని వెంట మరొకటి అంబులెన్స్‌లు ఆస్పత్రుల వద్దకు క్యూ కట్టడంతో భక్తుల బందువులు, ఆస్పత్రి సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంబులెన్స్‌ వైపు పరుగులు తీశారు. కాళ్లు విరిగి గాయపడ్డ భక్తుల ఆర్తనాదాలు కలిచివేశాయి. చికిత్సపొందుతున్నవారిని టీటీడీ ఈవో శ్యామలరావు, కలెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య, ఆర్డీవో రామ్మోహన్‌లతో పాటు పోలీసు అధికారులు పరామర్శించి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులను కోరారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.


అంచనా వేయడంలో అధికారుల విఫలం

తిరుపతిలో ఏర్పాటుచేసిన కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలుకోల్పోవడం బాధాకరం. టోకెన్‌ల జారీచేసే ముందు రోజు నుంచే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడం, అంచనా వేయడంలో అధికారులు విఫలం చెందడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుంది. ఏర్పాట్లు బాగా చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు బీజేపీ తీవ్ర సంతాపం ప్రకటిస్తోంది.

- సామంచి శ్రీనివాస్‌, బీజేపీ అధికార ప్రతినిధి


రుయాలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

మునిరెడ్డి (35), ఈశ్వరమ్మ (36), పార్వతి (52), ఎం.రజిని (40), నాగరాజు (46), శోభారాణి (37), సుబ్బాచారి (63), అంబలాష్‌ (40), సాంబశివ (69), సావిత్రమ్మ (65), లక్ష్మీదేవి (30), కళావతి (34), అప్పల కొండ (55), నరేంద్ర (40), జయభారతి (47), షాముల్‌ రాజు (45), ఆదిలక్ష్మి (62), సూర్యకమల (45), రాజేశ్వరి (52), ఎం.రత్నమ్మ (50), నూకా రత్నమ్మ (50), మల్లయ్య (42), పెద్దిరాజు (52), రమణమ్మ (48), శ్రీరామప్ప (70), సునీత (44), గౌరి (40), విజయలక్ష్మి (40), క్రిష్ణమ్మ (60), సూర్య (37), రమాదేవి (52). వీరిలో నలుగురు పాలిట్రామాతో చికిత్స పొందుతున్నారు. వీళ్ల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు అంటున్నారు. రాత్రి రుయా వద్దకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేరుకుని బాధితులతో మాట్లాడారు. కాగా, 1.25 గంటలకు బాధితులు, వారి బంధువులకు ఆస్పత్రుల వద్దకు టీటీడీ అన్నప్రసాదాలు పంపింది.


ఈవార్తను కూడా చదవండి: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్‌

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై కేసు పెడితే రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ సీఎం కావడానికి కారణమిదే.. సంచలన విషయాలు బయటపెట్టిన హరీష్‌రావు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2025 | 09:14 AM