TTD: ఆన్‌లైన్‌లో బ్రేక్ దర్శనాల బుకింగ్!
ABN , Publish Date - Jan 01 , 2025 | 03:56 AM
తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
ప్రజాప్రతినిధులకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్
కోటా ప్రకారం వారే నేరుగా బుక్ చేసుకొనేఅవకాశం
(తిరుమల-ఆంధ్రజ్యోతి)
తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరంగా, సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాన్య భక్తుల దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధులే నేరుగా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసుకునేలా ఆలోచన చేస్తున్నారు. నిత్యం దాదాపు 60-70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వారాంతాలు, విశేష పర్వదినాల్లో ఈ సంఖ్యలక్షకు చేరుతోంది. అయితే స్వామి దర్శనానికి వచ్చేవారిలో సగానిపైగా బ్రేక్ దర్శనాల కోసమే ఆరాటపడుతున్నారు. నిత్యం ఎవరో ఒక ప్రజాప్రతినిధి సిఫారసు లేఖతో వచ్చి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయం అధికారులు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధుల నుంచి రోజుకు రెండు, మూడు లేఖలు కూడా వస్తున్నాయి. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేలా టీటీడీ నూతన ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి టీటీడీ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ కేటాయించారు. కోటాకు తగినట్టు వారే ఆన్‌లైన్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అందజేసేవారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులకూ అమలుచేయడంపై అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ నేతల సిఫారసు లేఖలపై కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నూతన విధానం అమలులోకి తెస్తే ఆయా ప్రజాప్రతినిధులే తమ కోటాకు తగినట్టు ఆన్‌లైన్ ద్వారా బ్రేక్ టికెట్లు బుక్ చేసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో ఉన్న సమస్యలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ విధానంలో నేతలు వంద శాతం కోటాను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన విధంగా మార్పుచేర్పులు చేయాలని టీటీడీ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.