Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:58 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
పుష్ప, విద్యుత్ దీపాలంకరణలో కనువిందు చేస్తున్న క్షేత్రం
తిరుమల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. 12.05 గంటల సమయంలో తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారువాకిలి తలుపులు తెరిచారు. అనంతరం 12.25 గంటల సమయంలో వైకుంఠద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షణగా గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టుకు పుష్ప సమర్పణ చేశారు. తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. కాగా, శుక్రవారం వేకువజాము అభిషేకం, అలంకారం, తోమాల, అర్చన, నైవేద్యం నిర్వహించి 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. సాధారణంగా వైకుంఠ ఏకాదశి ముందురోజు మధ్యాహ్నం నుంచే తిరుమలలో వీఐపీల హడావుడి నెలకొంటుంది. కానీ, తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో రాజకీయ ప్రముఖులంతా గురువారం తిరుపతిలో జరిగిన సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనల్లోనే ఉండిపోయారు.
దీంతో గురువారం రాత్రి 7 గంటల వరకు కూడా తిరుమల సాధారణంగానే కనిపించింది. టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులతో తిరుమలలో ఒక మోస్తరు రద్దీ కనిపించింది. శుక్రవారం నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. మరోవైపు తిరుమలలో స్థానికులకు గురువారం వేకువజాము 4.50 గంటల నుంచి సాయంత్రం వరకు 1,700 టోకెన్లు జారీ చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని స్థానికేతరులెవ్వరూ తిరుమలలోని టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి.