VHP HAINDAVA SANKHARAVAM: ప్రభుత్వంపై స్వామీజీల ధర్మాగ్రహం.. డిక్లరేషన్
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:35 PM
VHP HAINDAVA SANKHARAVAM: మరే ఇతర మతాల్లో లేని ఆచార వ్యవహారాలు హిందూ దేవాలయాల్లో ఉన్నాయని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయా శాఖ పేరుతో అనుసరిస్తున్న వైఖరిని వారు తప్పు పట్టారు.
హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ స్వామిజీలు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఇతర మతాల్లో లేని ఈ తరహా పద్దతి హిందూ దేవాలయాలపైనే ఎందుకు అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. గుడి బయట చెప్పులు విడిచిన దగ్గర నుంచి గర్భ గుడిలో దేవుడి దర్శనం వరకు అంతా వ్యాపారమేనంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వెళ్లాలంటే.. జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఓ సామాన్య భక్తుడు సైతం తీవ్ర ఆవేదన చేస్తున్నాడని తెలిపారు. దేవుడికి, భక్తుడికి మధ్య ఈ ప్రభుత్వం ఇలా అనుసంధాన కర్తగా ఎందుకు వ్యవహరించాలని వారు సూటిగా నిలదీస్తున్నారు.
దేవాలయాల్లో భక్తులు పడుతోన్న వేదనను ఈ ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వేళ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటం కోసం హైందవ శంఖారావానికి విశ్వ హిందూ పరిషత్ పిలుపు నిచ్చింది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా అందుకోసం సభలు నిర్వహిస్తోంది. అందులోభాగంగా జనవరి ఐదవ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
హిందూ ఆలయాలు ప్రభుత్వాల చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని ఈ శంఖారావ సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఆరోపించారు. ఆలయాలను భక్తులే స్వయం ప్రతిపత్తితో నిర్వహించాలనే డిమాండ్ ఈ సందర్భంగా తెర మీదకు వచ్చింది. ఈ సభలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్, చిన్న జీయర్ స్వామి, కమలానంద భారతి స్వామితోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడిని ఈ సందర్భంగా వారు సోదాహరణగా వివరించారు.
దేవాలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామన్నారు. మన దేవాలయాలకు గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేదని.. కానీ ఐస్ గడ్డ మాదిరిగా కరుగుతూ 4.50 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలిందని గుర్తు చేశారు. ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు. కార్యాలయాల్లో కూర్చొని అధికారులు చేయాలా? అని నిలదీశారు.
ఆలయాలను నిర్మించుకొనే మనం.. వాటిని నడపలేమా? అని అడిగారు. ‘మా ఆలయాలను మేమే నిర్వహించుకుంటాం... అధికారులు అవసరం లేదు’’ ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆలయాలు.. రాజకీయ కమిటీలతో నిండిపోతున్నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాల ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో జరిగే దేవుడి ఆరాధనలు.. సంప్రదాయాల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. దేవుడి వద్ద వీఐపీ దర్శనాలేంటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తిరుపతిలో దేవుడి దర్శనాల్లో వీఐపీ, సామాన్యడు పేరిట జరుగుతోన్న తారతమ్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. దేవుడి దర్శనానికి నిబంధనలు పెట్ట బట్టే మతమార్పిడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఆలయాల్లో నిబంధనలు.. సంప్రదాయాలను పాటించని వారు.. విధుల నుంచి పక్కకు తొలగాలని సూచించారు. ఆక్రమణల్లో ఉన్న ఆలయాల ఆస్తులను స్వాధీనం చేయాలని అక్రమార్కులను డిమాండ్ చేశారు.
అలా జరిగితే ఆలయాలు ధూప దీప నైవేద్యాలకు చేయిచాచాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఆలయాల్లో దేవుడి దర్శనానికి టిక్కెట్లతో అవసరమే లేదని చెప్పారు. మన ఆలయాలు మళ్లీ పవర్ ఫుల్ సెంటర్లుగా మార్చుకోవాలని హిందువులకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు.
అలాగే శ్రీభువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామిజీ మాట్లాడుతూ.. మనం నిర్మించుకున్న ఆలయాలపై ప్రభుత్వాల పెత్తనమేంటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సినిమాలకు మాదిరి కౌంటర్లు, టిక్కెట్లు పెట్టి ఆలయాల్లో దైవ దర్శనాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ దుర్మార్గ మైనదని అభివర్ణించారు.
మన రాష్ట్రంలోని దేవాలయాల బోర్డుల్లో హిందూ అనే పదాన్ని తీసేశారని గుర్తు చేశారు. దీనిని ప్రశ్నించాలని హిందూ సమాజమానికి సూచించారు. ప్రభుత్వమే దేవాలయాల భూములను కబ్జా చేసి ప్రభుత్వ కార్యాలయాలు,గోడౌన్లు నిర్మించిందని విమర్శించారు. దేవాలయంలో ఒక దేవుడుంటే 20 హుండీలు ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే ప్రముఖ గీత రచయిత అనంత్ శ్రీరామ్ సైతం తనదైన శైలిలో స్పందించారు.
ఈ హైందవ శంఖారావ సభ వేదికగా డిక్లరేషన్..
హిందూ దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కలిపిస్తూ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేసింది. హిందు ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులు సరికాదని స్పష్టం చేసింది. అన్యాయంగా, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వినాయక చవితి, దసరా వేడుకలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక భారం, అక్రమ ఆంక్షలు తగవంది. హిందూ దేవ దేవతల శోభాయాత్రల మార్గాలు, తేదీలు, విధానాలపై అక్రమ ఆంక్షలు తగవని పేర్కొంది. ఆలయాల్లో పూజ, ప్రసాద, కైంకర్య సేవలు అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించాలని డిమాండ్ చేసింది.
హిందూ ఆలయాల్లో అన్య మత ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేసింది. ట్రస్టు బోర్డులో హిందూ ధర్మంపై భక్తి శ్రద్ధలు ఉండే భక్తులను మాత్రమే సభ్యులుగా నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే ట్రస్టు బోర్డుల్లో స్థానం కల్పించాలని స్పష్టం చేసింది. హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలంది.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకుని ఆలయాలకు తిరిగి వాటిని అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించ రాదని చెప్పింది. హైందవ శంఖారావంలో ఈ మేరకు డిక్లరేషన్‌పై చినజీయర్ స్వామిజీ సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.
Read Latest AP News and Telugu News