Vidadala Rajani: డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారు
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:28 AM
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై పలువురు బాధితులు తీవ్ర మోసం ఆరోపణలు చేశారు. రజనీ, ఆమె పీఏలు అనేక వ్యాపార లావాదేవీలలో డబ్బు తీసుకొని మోసాలు చేశారని ఆరోపిస్తున్నారు

విడదల రజనీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు
చిలకలూరిపేట, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ తమను ఘోరంగా మోసం చేశారని పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సోమవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని టీడీపీ కార్యాలయంలో రజనీ బాధితులు మీడియాతో మాట్లాడారు. ‘నేను వైసీపీలో ఉన్నప్పుడు రజనీ రూ.6.50 కోట్లు మూడు విడతలుగా తీసుకున్నారు. నేను ఆమెకు డబ్బిచ్చిన విషయం ఆధారాలతో సహా రుజువుచేస్తా.’ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లెల రాజేశ్ నాయుడు అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను మాట్లాడు తూ.. ‘రజని, ఆమె పీఏలు నాకు మున్సిపల్ చైర్మన్ పదవి ఆశచూపి రూ.7 కోట్లు కాజేశారు. రూ.7 కోట్లలో రూ.3.50 కోట్లు నగదు రూపంలో ఆమె తీసుకోగా, రూ.2.50 కోట్లు ఎన్నికల ప్రచారంలో నాతో ఖర్చు పెట్టించారు. ఆమె పీఏలు శ్రీకాంత్ రెడ్డి, దొడ్డా రామకృష్ణ అదనంగా మరో రూ.40 లక్షలు తీసుకున్నారు. ఆమెను డబ్బులు అడిగానని ఆమె అనుచరుడు ఫణి నన్ను కొట్టేందుకు ప్రయత్నించాడు’ అని వాపోయారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మున్నంగి వెంకటరత్నారెడ్డి మాట్లాడుతూ.. ‘రజనీ పీఏ మానుకొండ శ్రీకాంత్‌రెడ్డి.. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి రూ.25 లక్షలు తీసుకున్నాడు. కాంట్రాక్ట్ ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వలేదు. పైగా డబ్బులు అడిగానని అప్పటి వైస్ చైర్మన్ ద్వారా నన్ను బెదిరించారు.’’ అని వాపోయారు. యడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు మాట్లాడుతూ.. వంకాయలపాడు పంచాయతీ పరిధిలో స్టోన్ క్రషర్ల యజమానులను బెదిరించి ఒక్కొక్క క్రషర్ నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారని చెప్పారు. ‘‘ఐ-టీడీపీలో పనిచేస్తున్నానన్న అక్కసుతో నాపై తప్పుడు కేసులు పెట్టించారు. పోలీసులు నన్ను కొడుతుంటే రజనీ లైవ్‌లో చూశారు’’ అని పిల్లి కోటి పేర్కొన్నారు. గాంధీపార్క్ వద్ద చిరువ్యాపారం చేసుకునే దుకాణదారుల నుంచి రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చెప్పారు.