Share News

Visakhapatnam: షాపులోకి దూసుకుపోయిన ఇసుక లారీ

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:35 AM

విశాఖ నగర పరిధిలోని గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం ఒక ఇసుక లారీ బీభత్సం సృష్టించింది.

Visakhapatnam: షాపులోకి దూసుకుపోయిన ఇసుక లారీ

  • స్టీల్‌ప్లాంటు ఉద్యోగి దుర్మరణం.. త్రుటిలో తప్పించుకున్న మహిళ

గాజువాక, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగర పరిధిలోని గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం ఒక ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలై సరాసరి ఓ దుకాణంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో స్టీల్‌ప్లాంటు ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. వివరాలివీ.. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇసుక లోడుతో ఓ లారీ సుందరయ్య కాలనీ వీధిలోకి వెళ్తోంది. వీధి చివర మలుపు తిరగాల్సి ఉండగా, లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడం, ఆపై ఆ ప్రాంతం పల్లంగా ఉండడంతో సరాసరి ఎదురుగా ఉన్న జెరాక్స్‌ దుకాణంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో జెరాక్స్‌ షాపు యజమాని పక్కనే ఉన్న ఇంటికి భోజనానికి వెళ్లగా, జెరాక్స్‌ తీయించుకునేందుకు వచ్చిన స్టీల్‌ప్లాంటు ఉద్యోగి బీవీ రమణ (58) బలైపోయారు. లారీ వేగంగా దూసుకొచ్చి బలంగా ఢీకొనడంతో రమణ అక్కడికక్కడే మృతిచెందారు. షాపు ముందు నిలబడిన మరో మహిళ.. లారీ వేగంగా రావడాన్ని గమనించి పక్కకు తప్పుకోవడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతి కష్టం మీద లారీని వెనక్కి తీసి, మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాదంలో జెరాక్స్‌ షాప్‌ పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 01 , 2025 | 06:35 AM