మహిళా రైతు దారుణ హత్య
ABN , Publish Date - Jan 10 , 2025 | 01:19 AM
మండలంలోని లక్కవరం గ్రామ శివారు చెరకు తోటలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ గొంతు కోసిన గుర్తు తెలియని దుండగులు.. ఆమె మెడలో, చెవులకు ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. చోడవరం- దేవరాపల్లి రహదారికి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లక్కవరం గ్రామానికి చెందిన వబలరెడ్డి నరసింహమూర్తి భార్య నరసమ్మ(60) పశువులకు గడ్ది కోసేందుకు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో పొలానికి వెళ్లింది. కొంతసేపటి తరువాత గడ్డి తెచ్చేందుకు నరసింహమూర్తి పొలానికి వెళ్లాడు.
పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు బంగారం కోసం గొంతు కోసి అఘాయిత్యం
చోడవరం మండలం లక్కవరంలో దారుణం
చోడవరం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్కవరం గ్రామ శివారు చెరకు తోటలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ గొంతు కోసిన గుర్తు తెలియని దుండగులు.. ఆమె మెడలో, చెవులకు ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. చోడవరం- దేవరాపల్లి రహదారికి సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లక్కవరం గ్రామానికి చెందిన వబలరెడ్డి నరసింహమూర్తి భార్య నరసమ్మ(60) పశువులకు గడ్ది కోసేందుకు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో పొలానికి వెళ్లింది. కొంతసేపటి తరువాత గడ్డి తెచ్చేందుకు నరసింహమూర్తి పొలానికి వెళ్లాడు. అయితే భార్య అక్కడ కనిపించకపోవడంతో పొలంలో వెతికాడు. పక్కనే వున్న చెరకు తోటలో చీర కనిపించడంతో అటుగా వెళ్లి చూడగా నరసమ్మ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. దీంతో బిగ్గరగా కేకలు వేయడంతో సమీపంలోని పొలాల్లో వున్న రైతులు అక్కడకు వచ్చారు. నరసమ్మ గొంతు కోసి వుంది. ఆమె మెడలో, చెవులకు వుండాల్సిన నాలుగు తులాలకుపైగా బంగారు వస్తువులు కనిపించలేదు. పొలంలో పట్టపగలు మహిళ హత్యకు గురికావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తరహాలో బంగారం కోసం మహిళను హత్య చేసిన ఘటన గత ఏడాది గోవాడ శివారు ప్రాంతంలో జరిగింది. ఇప్పుడు లక్కవరంలో ఇదే తరహాలో హత్య జరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగకార్తీక్, ఏఎస్‌ఐ శ్యామల ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గురువారం రాత్రి అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ వెళ్లి ఆధారాలను సేకరించింది. ఈ దారుణానికి పాల్పడింది ఒక్కరేనా? అంతకన్నా ఎక్కువ మందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.