Share News

పర్యాటకుల తాకిడి

ABN , Publish Date - Jan 01 , 2025 | 11:34 PM

కొత్త సంవత్సరం తొలి రోజైన బుధవారం మన్యంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు ఇక్కడ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారమే మన్యం బాట పట్టారు.

పర్యాటకుల తాకిడి
బొర్రా గుహలకు పోటెత్తిన పర్యాటకులు

పర్యాటక ప్రాంతాల్లో కొత్త సంవత్సరం సందడి

అధిక సంఖ్యలో తరలి రావడంతో రద్దీ

పాడేరు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరం తొలి రోజైన బుధవారం మన్యంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పర్యాటకులు ఇక్కడ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మంగళవారమే మన్యం బాట పట్టారు. దీంతో బుధవారం ఎక్కడ చూసినా పర్యాటకుల కోలాహలమే కనిపించింది.

అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని ఇటు చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, రణజిల్లెడ జలపాతం, పెదలబుడు గిరి గ్రామదర్శిని, డుంబ్రిగుడలోని చాపరాయిగెడ్డ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాల్లో రద్దీ నెలకొంది.

అరకులోయలో..

అరకులోయ: మండలంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో రద్దీగా కనిపించాయి. బుధవారం పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియం వద్ద పర్యాటకులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. పద్మాపురం గార్డెన్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో విహరించి ఎంజాయ్‌ చేశారు. మాడగడ సన్‌రైజ్‌ హిల్స్‌కు వేకువజామునే చేరుకుని మంచు అందాలను తిలకించి పరవశించారు.

బొర్రా గుహలు వద్ద..

అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు నూతన సంవత్సరం రోజున పర్యాటకులు పోటెత్తారు. బుధవారం 4,800 మంది గుహలను సందర్శించగా, రూ.4.26 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్‌ మేనేజర్‌ గౌరీ శంకర్‌ తెలిపారు. కాఫీ ప్లాంటేషన్‌, డముకు వ్యూపాయింట్‌, తాటిగుడ, కటికి, సరియా, చిట్టంపాడు జలపాతాల వద్ద కూడా పర్యాటకుల తాకిడి కనిపించింది.

Updated Date - Jan 01 , 2025 | 11:34 PM