కళ్ల ముందు కదనరంగం
ABN , Publish Date - Jan 05 , 2025 | 01:47 AM
కళ్ల ముందు ఆవిష్కృతమైన కదన రంగాన్ని విశాఖ ప్రజలు శనివారం సాయంత్రం కళ్లు అప్పగించి చూశారు.
ఆద్యంతం కట్టిపడేసిన నేవీ సాహస విన్యాసాలు
ఆకాశంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల చక్కర్లు
సముద్రంలో ఆయిల్ రిగ్‌ల పేల్చివేత
తీరానికి సమీపంలో బారులుతీరిన యుద్ధ నౌకలు
8 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగిన మార్కోలు
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
కళ్ల ముందు ఆవిష్కృతమైన కదన రంగాన్ని విశాఖ ప్రజలు శనివారం సాయంత్రం కళ్లు అప్పగించి చూశారు. ఆకాశంలో ఎగురుతూ వచ్చిన హెలికాప్టర్ నుంచి మెరైన్ కమెండోలు తాడు సాయంతో కిందకు దిగి అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న జెమినీ బోట్లలో తీరానికి చేరుకొని శత్రుస్థావరంపై చేసిన దాడి, శత్రు దేశాల ఆర్థిక సంపదను నాశనం చేస్తున్నట్టు సముద్రంలో ఆయిల్ రిగ్‌ల పేల్చివేత...నిజంగా యుద్ధ వాతావరణాన్నే తలపించింది.
నేవీ డే సందర్భంగా డిసెంబరు 4న విన్యాసాల ప్రదర్శన ఈసారి పూరీ తీరంలో రాష్ట్రపతి ఎదుట నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం మరోసారి శనివారం సాయంత్రం ప్రదర్శించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భార్య భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి హాజరయ్యారు. తొలుత ఎనిమిది వేల అడుగుల ఎత్తులో గల అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ నుంచి దూకిన నలుగురు మార్కోలు పారాచ్యూట్ల సాయంతో లాఘవంగా ముఖ్య అతిథులు ఆశీనులైన వేదిక వద్ద దిగి శభాష్ అనిపించుకున్నారు. సముద్రంలో కదులుతున్న యుద్ధ నౌకలపై హెలికాప్టర్లను సురక్షితంగా దించడం, తిరిగి టేకాఫ్ తీసుకోవడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అటువంటి సాహసాన్ని అలవోకగా చేసి చూపించారు. ఐఎన్‌ఎస్ సహ్యాద్రి నౌకపైకి చేతక్ హెలికాప్టర్‌ను, ఐఎన్‌ఎస్ మైసూర్, ఐఎన్‌ఎస్ ఢిల్లీ నౌకలపైకి అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, స్టెల్త్ ఫ్రిగేట్ నౌక ఐఎన్‌ఎస్ సాత్పురపైకి సీ కింగ్ హెలికాప్టర్లను దించి పైలట్లు నైపుణ్యాన్ని చాటారు.
సముద్రంలో చిక్కుకుపోయిన వారిని డబుల్ ఇంజన్ కలిగిన అడ్వాన్స్‌డ్ ఏఎల్ హెలికాప్టర్‌లో వచ్చి రక్షించిన విధానం ఎంత కష్టతరమైనదో అందరికీ అర్థమైంది. సముద్రంలో బారులు తీరిన యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ ముంబై, కిల్తాన్, కవరత్తిల నుంచి సబ్‌మెరైన్‌లను మట్టి కరిపించే రాకెట్లను ప్రయోగించి ఆహా అనిపించారు. చివరిగా నాలుగు చేతక్ హెలికాప్టర్లు, ఒక సీ కింగ్ హెలికాప్టర్, మూడు ఏఎల్ హెలికాప్టర్లు, నాలుగు డార్నియర్ విమానాలు, ఒక నిఘా విమానం పీ8ఐ, ఏడు హాక్ జెట్ విమానాలు ఒక బృందం తరువాత మరొక బృందం వేదిక ముందుగా వచ్చి అతిథుల ముందు నిర్వహించిన ఫ్లై పాస్ట్ కనువిందు చేసింది. సబ్‌మెరైన్ ఐఎన్‌ఎస్ వేల అల్లంత దూరం నుంచి అందరికీ హాయ్ చెప్పి కనుమరుగైంది. ప్రదర్శన అనంతరం ఐఎన్‌ఎస్ సావిత్రి యుద్ధనౌక నుంచి చేసిన లేజర్ షో అలరించింది. డ్రోన్లతో ఆకాశంలో ఆవిష్కరించిన నమూనాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. నేవీ బ్యాండ్ బీటింట్ రిట్రీట్ ప్రదర్శన, సీ క్యాడెట్ల నృత్యం, సెయిలర్ల కంటిన్యువిటీ డ్రిల్, హార్న్ పైప్ డ్యాన్సు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో నగర ప్రజలు హాజరయ్యారు.
ఆర్థిక రాజధానిగా విశాఖ
నాలెడ్జ్ హబ్, మారీటైమ్ గేట్‌వేగా రూపాంతరం
డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం
భవనం ఎంపిక చేసుకున్న టీసీఎస్
త్వరలో మరికొన్ని ఐటీ కంపెనీలు రాక
మరో ఏడాదిలో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి
8న రైల్వే జోన్ కార్యాలయానికి ప్రధాని శంకుస్థాపన
స్టీల్‌ప్లాంటును పరిరక్షిస్తాం
ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి జలాలు..వచ్చే ఏడాది విశాఖకు
నేవీ సేవలు మరువలేనివి
విశాఖలో తూర్పు నౌకాదళం ఉండడం అదృష్టంగా భావిస్తున్నా
నేవీ ఆపరేషన్ డెమోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
ఆంఽధప్రదేశ్‌కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆర్‌కే బీచ్‌లో తూర్పు నౌకాదళం శనివారం సాయంత్రం నిర్వహించిన సాహస విన్యాసాల ప్రదర్శనలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశాఖ మేటి నగరంగా తయారవుతుందన్నారు. పర్యాటక రాజధానిగా, నాలెడ్జ్ హబ్ సిటీగా, మారీటైమ్ గేట్‌వేగా రూపాంతరం చెందుతుందన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం చేసుకుందని, ఇప్పటికే టీసీఎస్ భవనం కూడా ఎంపిక చేసుకుందన్నారు. మరిన్ని ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నెల 8న ప్రధాని విశాఖలో రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. స్టీల్‌ప్లాంటును పరిరక్షిస్తున్నామన్నారు. మరో ఏడాదిలో భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని, త్వరలో విశాఖకు మెట్రో రైలు కూడా వస్తుందన్నారు. నగరంలో కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియంతో పాటు టీయూ-142 కూడా తామే ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరొకటి యుహెచ్-3హెచ్ మ్యూజియం వస్తుందన్నారు. రాష్ట్రంలో వేయి కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని, మౌలిక వసతులు కల్పించినట్టయితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సంపద పెరుగుతుందన్నారు. గోదావరి జలాలను పోలవరం ఎడమ కాలువ ద్వారా ఈ ఏడాదే అనకాపల్లి జిల్లాకు తీసుకువస్తామని, వచ్చే ఏడాది విశాఖపట్నం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.
దేశ రక్షణలో కీలకంగా ఉండే నౌకాదళం రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అదే చొరవతో ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నదని ప్రశంసించారు. హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు తాను పది రోజులు ఇక్కడే ఉండి అన్నీ సరిచేశానని, ఆ సమయంలో నేవీ అందించిన సహకారం మరువలేనిదన్నారు. విశాఖలో తూర్పు నౌకాదళం ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తుఫాన్లు వచ్చిన ప్రతిసారి మత్స్యకారులను రక్షించడంలో కీలక పాత్ర వహిస్తుందన్నారు.