అక్రమాలకు మహా ఊతం
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:23 AM
ఎవరైనా భవన నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట పరిశీలించే కిందిస్థాయి అధికారి రాసిన రిమార్కులనే పైస్థాయి అధికారులు తమ రిమార్కులుగా రాస్తారు.
కోణార్క్ లాడ్జి వెనుక స్థలంలో భవన నిర్మాణానికి రెండేళ్ల క్రితం జీవీఎంసీకి దరఖాస్తు
ఆ స్థలం అప్రూవ్డ్ లేఅవుట్‌లో రిజర్వు స్పేస్‌గా ఉందంటూ షార్ట్ ఫాల్‌లో రాసిన వార్డు ప్లానింగ్ సెక్రటరీ
హైకోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు స్పష్టంగా నమోదు
ఆస్తి పన్ను రశీదు కూడా ఆ స్థలానిది కాదంటూ రిమార్కు
సిటీ ప్లానర్ లాగిన్‌కు వెళ్లేసరికి రిమార్కులన్నీ మాయం
కేవలం అంతస్థుల సంఖ్య, ఎలివేషన్ చూపలేదని మాత్రమే నోట్
ఆయా అభ్యంతరాలను దరఖాస్తుదారుడు సులభంగా సరిదిద్దుకునేందుకు అవకాశం
ఒక్కో అధికారి, ఒక్కోలా షార్ట్ ఫాల్ రాయడంపై అనుమానాలు
ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఎవరైనా భవన నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట పరిశీలించే కిందిస్థాయి అధికారి రాసిన రిమార్కులనే పైస్థాయి అధికారులు తమ రిమార్కులుగా రాస్తారు. ఇంకా చెప్పాలంటే...కింది స్థాయి అధికారులు గుర్తించలేని లోపాలు, అభ్యంతరాలను కూడా తమ రిమార్కులుగా షార్ట్ ఫాల్‌లో చూపించాలి. కానీ డైమండ్ పార్కు సమీపంలో కోణార్క్ లాడ్జి వెనుక ఉన్న ఒక స్థలం విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ బాధ్యతను విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. కిందిస్థాయి అధికారి షార్ట్ ఫాల్‌లో రాసిన రిమార్కులను తొక్కిపెట్టి, మొక్కుబడిగా సులభంగా పరిష్కరించుకునే రిమార్కులను మాత్రమే షార్ట్ ఫాల్‌లో చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డైమండ్ పార్కు సమీపంలో అల్లిపురం సర్వే నంబర్ 653, 654లో 1950లో వేసిన ఒక అప్రూవుడ్ లేఅవుట్ ఉంది. అందులో కొన్ని రిజర్వు స్పేస్‌లుగా లేఅవుట్‌లో మార్కింగ్ చేశారు. అందులో ప్లాట్ నంబర్ 5-బి పార్ట్-3లో భవన నిర్మాణం కోసం స్థల యజమానిగా చెప్పుకుంటున్న ఒకరు 2023 సెప్టెంబరు 2న జీవీఎంసీకి ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై టౌన్‌ప్లానింగ్ మల్లగుల్లాలు పడిన తర్వాత గత ఏడాది నవంబరు 12న ఆ ప్రాంత పరిధిలోని వార్డు ప్లానింగ్ సెక్రటరీ దరఖాస్తును, దాంతోపాటు జత చేసిన పత్రాలను, భవన నిర్మాణం జరిగే స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ స్థలానికి తాము ఆస్తి పన్ను కడుతున్నట్టు పేర్కొంటూ జత చేసిన రశీదు ఆ స్థలానికి చెందినది కాదని, ఆ స్థలానికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నుంచి అప్‌డేట్‌గా తీసుకున్న ఈసీని సమర్పించలేదని, భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలం అప్రూవ్డ్ లేఅవుట్‌లో రిజర్వు స్పేస్ కింద మార్కింగ్ చేసి ఉందని, ఆ స్థలంపై హైకోర్టులో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని షార్ట్ ఫాల్‌లో నమోదు చేశారు. వాటన్నింటినీ పరిష్కరించే పత్రాలను జత చేసి దరఖాస్తును రీ సబ్మిట్ చేయాలని పొందుపరుస్తూ తన పైఅధికారి అయిన టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ)కి ఫార్వాడ్ చేశారు. అదే నెల 21న టీపీఓ కొన్ని రిమార్కులు రాసి ఏసీపీకి, ఫార్వాడ్ చేశారు. దరఖాస్తును పరిశీలించిన ఏసీపీ కొన్ని రిమార్కులు రాసి అదేనెల 23న డీసీపీకి ఫార్వాడ్ చేశారు. డీసీపీ కూడా అదేరోజున దరఖాస్తుపై కొన్ని రిమార్కులు రాసి తన లాగిన్ నుంచి సిటీ ప్లానర్ (సీపీ)కి ఫార్వాడ్ చేశారు. అయితే సీపీ లాగిన్‌కు వెళ్లేసరికి వార్డు ప్లానింగ్ సెక్రటరీ షార్ట్ ఫాల్‌లో రాసిన రిమార్కులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఆస్తి పన్ను చెల్లించినట్టు లేటెస్ట్ రశీదు, ప్లాన్‌లో ఎన్ని ఫ్లోర్‌లు కడుతున్నారు, భవనం ఎలివేషన్ డిజైన్ మాత్రమే లేదని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను పరిష్కరించుకుని దరఖాస్తును రీ సబ్మిట్ చేయాలంటూ అదేనెల 25న షార్ట్‌ఫాల్ చూపించారు. అయితే వార్డు ప్లానింగ్ సెక్రటరీ షార్ట్‌ఫాల్‌లో చూపించిన రిమార్కులు సిటీ ప్లానర్ లాగిన్‌కు వచ్చేసరికి కనిపించకపోవడం, ఏదో షార్ట్ ఫాల్‌లో పెట్టామని చెప్పుకోవడానికి అన్నట్టు మొక్కుబడిగా సులభంగా పరిష్కరించుకోగలిగే రిమార్కులు మాత్రమే కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత కీలకమైన ఆ స్థలం లేఅవుట్‌లో రిజర్వు స్పేస్ కింద చూపించారని, ఆ స్థలానికి సంబంధించినది కాకుండా వేరొక స్థలానికి సంబంధించిన ఆస్తిపన్ను రశీదు చూపించారనే రిమార్కులను వేర్వేరు స్థాయిల్లో అధికారులు తొక్కిపెట్టి, సిటీ ప్లానర్ వద్దకు వెళ్లేసరికి కేవలం చిన్నపాటి రిమార్కులు రాసి దరఖాస్తును తిరిగి సమర్పించాలని షార్ట్ ఫాల్‌లో రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కిందిస్థాయి అధికారి లేవనెత్తిన అభ్యంతరాలకు దరఖాస్తుదారుడు రీ సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే తగిన పత్రాలతో నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తును పరిశీలించిన అధికారి ఆయాపత్రాలు సరైనవేనని, ప్రతిపాదిత స్థలానికి సంబంధించినవేనని, ఆ స్థలంపై ఎలాంటి వివాదాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తన లాగిన్‌లో తాను సంతృప్తిచెందినట్టు రిమార్కు రాసి ఆమోదానికి తన పైఅధికారికి ఫార్వడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్థలం విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఒక్కో స్థాయిలో ఒక్కోలా రిమార్కులు రాయడం, దరఖాస్తుదారుడుకు మేలు చేసేలా వ్యవహరించారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై చీఫ్ సిటీ ప్లానర్, జీవీఎంసీ కమిషనర్ లోతుగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.