వివాదాల నిలయం విశాఖ కేంద్ర కారాగారం
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:29 AM
విశాఖపట్నం కేంద్ర కారాగారంలో అధికారులకు, సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. జైలు లోపలకు గంజాయి తీసుకువెళుతూ ఫార్మసిస్టు పట్టుబడినప్పటి నుంచి తరచూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో జైలులో ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టిసారించింది.
అధికారులకు సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్
గత నెల రోజులుగా ఏదో ఒక రచ్చ
ఖైదీలకు గంజాయి తీసుకువెళుతూ పట్టుబడ్డ ఫార్మసిస్టు
ఖైదీల నుంచి రాత్రి వేళ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్లు వెళుతున్నట్టు గుర్తింపు
సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్‌లపై వేటు
తాజాగా ఇద్దరు వార్డర్లపై అనుమానంతో తనిఖీ చేయించిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్
జైలు ఎదుట వార్డర్లు, కుటుంబ సభ్యులు ఆందోళన
మూకుమ్మడిగా 37 మంది వార్డర్లను బదిలీ చేసిన జైళ్ల శాఖ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం కేంద్ర కారాగారంలో అధికారులకు, సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. జైలు లోపలకు గంజాయి తీసుకువెళుతూ ఫార్మసిస్టు పట్టుబడినప్పటి నుంచి తరచూ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో జైలులో ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టిసారించింది.
రాష్ట్రంలోనే అతిపెద్ద జైలుగా గుర్తింపుపొందిన అడవివరంలోని కేంద్ర కారాగారంలో 2,200కి పైగా ఖైదీలు ఉంటున్నారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, విధి నిర్వహణలో అలసత్వం కారణంగా కొంతమంది ఖైదీలు జైలులో ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలల కిందట రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ గుర్రాల సాయి కోర్టు నుంచి తిరిగి జైలుకు వెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బందిపై తిరగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదిలావుండగా నెల రోజుల కిందట జైలు ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తన లంచ్ బ్యాగ్‌లో గంజాయి తీసుకువెళుతూ ప్రధానద్వారం వద్ద గార్డు సిబ్బందికి పట్టుబడ్డాడు. దీంతో ఖైదీలకు గంజాయి సరఫరా అవుతుందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కిషోర్‌తోపాటు అదనపు సూపరిటెండెంట్ వెంకటేశ్వర్లును బదిలీ చేశారు. ఖైదీలకు సిబ్బంది ద్వారా గంజాయి చేరడంతోపాటు రాత్రి సమయంలో లోపల నుంచి సెల్ ఫోన్ ద్వారా కాల్స్ బయటకు వెళుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. కేంద్ర కారాగారం లొకేషన్ నుంచి సెల్‌ఫోన్ కాల్‌డేటా రికార్డులు తీయగా రాత్రి సమయంలో ఖైదీలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఫోన్లు మాట్లాడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో కిషోర్, వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీచేశారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమితులైన మహేష్‌బాబు జైలులో నిబంధనలు కఠినంగా అమలుచేయడం మొదలుపెట్టారు. జైళ్ల శాఖ మాన్యువల్‌లో పేర్కొన్నారంటూ అనుమానం ఉన్న జైలు సిబ్బందిని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. సిబ్బంది లంచ్ బ్యాగ్‌లను లోపలకు అనుమతించడం మానేశారు. సెల్‌ఫోన్‌లను కూడా గేటు వద్దనే డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ పరిణామం కొందరికి ఇబ్బందిగా మారింది. ఇద్దరు వార్డర్లు తరచూ గంజాయి తీసుకువెళుతున్నట్టు సూపరింటెండెంట్‌కు అనుమానం రావడంతో నాలుగు రోజుల కిందట వారిద్దరినీ ప్రైవసీ గదిలోకి తీసుకువెళ్లి తనిఖీ చేశారు. అయితే తోటి సిబ్బంది, ఖైదీలు ఎదురుగా తమను తనిఖీ చేయడం అవమానంగా భావించిన వార్డర్లు తమ ఆవేదనను తోటి వార్డర్ల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో అంతా కలిసి జైలు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగగా, ఇతర అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు. కొద్దిసేపటికే సూపరింటెండెంట్ తమను కించపరిచేలా మాట్లాడారంటూ కుటుంబ సభ్యులతో సహా జైలు గేటు వద్ద మళ్లీ ఆందోళనకు దిగారు. జైళ్ల శాఖ డీఐజీ హరికిరణ్ అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తమ క్వార్టర్లలో పోలీసుల సహాయంతో తనిఖీలు చేయించారంటూ వార్డర్లు మరోసారి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో జైళ్ల శాఖ అధికారులతో కొందరు వార్డర్లు వాగ్వాదానికి దిగారు. ఈ విషయం డీఐజీ ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించడంతో ఇక్కడ పనిచేస్తున్న 37 మంది వార్డర్లను ఇతర జైళ్లకు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వివాదానికి ఇకనైనా పుల్‌స్టాప్ పడుతుందా...లేదా...అనేది చూడాలి.