అడ్డదారి గురువులపై యాక్షన్
ABN , Publish Date - Jan 09 , 2025 | 01:12 AM
‘గురువులు అడ్డదారి’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విద్యా శాఖ అధికారులు స్పందించారు. నర్సీపట్నం మండలంలో ఎంపీపీ పాఠశాలల్లో పేర్లు నమోదు చేయించి, ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు చర్యలు చేపట్టారు. కొత్తబయపురెడ్డిపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ కె.సంధ్య, నగరం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు జి.సూర్యప్రకాశ్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి విద్యా శాఖ అధికారులు స్పందన
నర్సీపట్నం మండలంలో ఇద్దరు టీచర్లకు షోకాజ్ నోటీసులు
నర్సీపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘గురువులు అడ్డదారి’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విద్యా శాఖ అధికారులు స్పందించారు. నర్సీపట్నం మండలంలో ఎంపీపీ పాఠశాలల్లో పేర్లు నమోదు చేయించి, ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి గిడ్డి అప్పారావునాయుడు చర్యలు చేపట్టారు. కొత్తబయపురెడ్డిపాలెం ఎంపీపీ స్కూల్ టీచర్ కె.సంధ్య, నగరం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు జి.సూర్యప్రకాశ్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ, తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల రికార్డుల్లో పేర్లు నమోదు చేసినట్టు వచ్చిన ఫిర్యాదులపై డిప్యూటీ డీఈవో అప్పారావు ఈ నెల 6వ తేదీన విచారణ జరిపారు. అనంతరం నివేదికను డీఈవోకి అందజేశారు. దీనిపై సంజాయిషీ కోరుతూ కొత్తబయపురెడ్డిపాలెం, నగరం ఎంపీపీ పాఠశాలల టీచర్లు కె.సంధ్య, సూర్యప్రకాశ్‌లకు డీఈవో నోటీసులు జారీ చేశారు. ఎంఈవో బుధవారం తన కార్యాలయం సిబ్బందితో నోటీసులను సంబంధిత ఉపాధ్యాయులకు పంపారు. షోకాజ్ నోటీసులకు మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
8ఆర్‌ఎల్‌జీ3: రోలుగుంట మండలం వెలంకాయలపాలెం ప్రాథమిక పాఠశాల
రోలుగుంట మండలంలో..
రోలుగుంట, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకున్నట్టు ఫిర్యాదులు రావడంతో మండల విద్యా శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని బలిజిపాలెం, జె.నాయుడుపాలెం, అర్ల, జగ్గంపేట, కశిరెడ్డిపాలెం, నిండుగొండ, వెలంకాయలపాలెంతోపాటు మరికొన్ని పాఠశాలల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో కసిరెడ్డిపాలెం పాఠశాలలో ఒక విద్యార్థి, జగ్గంపేట పాఠశాలలో ఇద్దరు, భోగాపురం పాఠశాలలో ఒక విద్యార్థి.. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నట్టు గుర్తించారు దీంతో ఆన్‌లైన్‌లో వారి పేర్లను తొలగించారు. అయితే ఇందుకు బాధ్యులైన ఉపాధ్యాయులకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.