Share News

కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యం చేరకుంటే చర్యలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 10:16 PM

ఈఏడాది కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యం చేరకుంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ హెచ్చరించారు.

కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యం చేరకుంటే చర్యలు
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌, పక్కన ఏపీవో వెంకటేశ్వరరావు

సిబ్బందికి ఐటీడీఏ పీవో అభిషేక్‌ హెచ్చరిక

అరకులోయ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

50 శాతం లక్ష్యం చేరని సిబ్బందిని తొలగిస్తా..

లక్ష్యం పూర్తి చేసిన వారికి ప్రోత్సాహాకాలిస్తా..

పాడేరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఈఏడాది కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యం చేరకుంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ హెచ్చరించారు. ఐటీడీఏ కాఫీ విభాగానికి చెందిన అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం పరిఽధిలోని క్షేత్రస్థాయి సిబ్బందితో శనివారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది కాఫీ పండ్ల కొనుగోలు లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా చేరాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి లక్ష్యానికి దూరమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఈనెల 20వ తేదీ నాటికి లక్ష్యం మేరకు కాఫీ పండ్ల కొనుగోలు చేపట్టాలన్నారు. అరకులోయ నియోజకవర్గం పరిధిలోని సిబ్బంది పనితీరు ఆశాజనకంగా లేదని, వారి పనితీరు మార్చుకోవాలని హితువు పలికారు. కాఫీ ప్రాజెక్టును సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. అలాగే 50 శాతం కొనుగోలు లక్ష్యం చేరని సిబ్బందిని విధుల్లోని తొలగిస్తామని, లక్ష్యాన్ని సాధించిన సిబ్బందికి ప్రోత్సాహకాలిస్తానని పీవో అభిషేక్‌ ప్రకటించారు. గిరిజన కాఫీ రైతులకు మేలు చేసేందుకు సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కాఫీ విభాగానికి చెందిన క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 10:16 PM