Share News

విమానాశ్రయం ప్రగతిపథం

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:28 AM

విశాఖపట్నం విమానాశ్రయం నూతన సంవత్సరంలో కొత్త కబురు వినిపించబోతోంది. మల్కన్‌గిరి నుంచి విశాఖకు విమాన సర్వీస్‌ నడపడానికి ఒడిశా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇండియా వన్‌ ఎయిర్‌ సంస్థ ఈ విమానం నడపనున్నది. త్వరలోనే ఈ సర్వీస్‌ ప్రారంభం కానుంది.

విమానాశ్రయం  ప్రగతిపథం

రోజుకు 30 విమానాలు

9,000 మంది రాకపోకలు

గడచిన ఏడాది విజయవాడ, హైదరాబాద్‌లకు అదనపు సర్వీస్‌లు

బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌లకు కొత్తగా విమానాలు

త్వరలో మల్కన్‌గిరికి...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం విమానాశ్రయం నూతన సంవత్సరంలో కొత్త కబురు వినిపించబోతోంది. మల్కన్‌గిరి నుంచి విశాఖకు విమాన సర్వీస్‌ నడపడానికి ఒడిశా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇండియా వన్‌ ఎయిర్‌ సంస్థ ఈ విమానం నడపనున్నది. త్వరలోనే ఈ సర్వీస్‌ ప్రారంభం కానుంది.

విమానాశ్రయం గడచిన ఏడాది (2024) గణనీయమైన ప్రగతి సాధించింది. రాష్ట్ర రాజధాని విజయవాడకు గతంలో కేవలం ఒకే ఒక సర్వీస్‌ ఉండగా, అదనంగా మరో రెండు ప్రారంభమయ్యాయి. అలాగే పూర్వ రాజధాని హైదరాబాద్‌కు కూడా మరో సర్వీస్‌ పెరిగింది. ఇప్పుడు రోజుకు 30 విమానాలు వచ్చి వెళుతున్నాయి. అంటే 60 ఆపరేషన్లు. రోజుకు తొమ్మిది వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, తిరుపతి, పోర్టు బ్లెయిర్‌, కర్నూలు, జైపూర్‌లకు దేశీయ సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఇక అంతర్జాతీయ సర్వీస్‌లు గతంలో ఒక్క సింగపూర్‌కే ఉండగా, 2024లో బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌లకు విమానాలు ప్రారంభమయ్యాయి. దుబాయ్‌కు కూడా సర్వీస్‌ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ మాజీ ఎంపీ, ప్రస్తుతం ఒడిశా గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు ద్వారా విశాఖ నుంచి భువనేశ్వర్‌కు కొత్త విమాన సర్వీస్‌ నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అందుబాటులోకి వచ్చిన అదనపు వసతులు

గత ఏడాది ప్రయాణికులకు అవసరమైన వసతులు సమకూర్చారు. చెక్‌ ఇన్‌ కౌంటర్లు పది ప్రారంభించారు. ఇన్‌లైన్‌ బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేశారు. బయటకు వెళ్లేందుకు కొత్త గేటు ఒకటి తెరిచారు. నాలుగు ఇమిగ్రేషన్‌ కౌంటర్లు పెట్టారు. మరో రెండు ముందస్తు చెకింగ్‌ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ ప్రయాణికుల కోసం అదనంగా 6 వేల చ.అ. లాంజ్‌ ఏర్పాటుచేశారు. ఎగ్జిక్యూటివ్‌ పాసింజర్‌ లాంజ్‌ కూడా ఉంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రి పెయిడ్‌ ట్యాక్సీలకు తోడుగా ఓలా, ఉబర్‌, ర్యాపిడో వంటి సర్వీస్‌లకు అవకాశం కల్పించారు. ప్రయాణికులు వారి గుర్తింపు కార్డు పరిశీలనకు ఎక్కువ సమయం క్యూలో నిల్చోకుండా డిజి-యాత్ర విధానం అమలులోకి తీసుకువచ్చారు. కేవలం ముఖ గుర్తింపుతోనే క్లియరెన్స్‌ లభిస్తోంది.

డిసెంబరులో 2.8 లక్షల మంది ప్రయాణం

2024 అక్టోబరులో 1,921 విమానాల ద్వారా 2,62,045 మంది ప్రయాణం చేయగా, నవంబరులో 1,845 విమానాల ద్వారా 2,49,937 మంది ప్రయాణించారు. డిసెంబరులో ప్రయాణికుల సంఖ్య 2,80,000 వరకు ఉంటుందని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కుమార్‌రాజా, నరేశ్‌కుమార్‌, డీఎస్‌ వర్మలు తెలిపారు. గత ఏడాది డిసెంబరులో ఈ సంఖ్య 2.19 లక్షలే ఉండగా ఈ డిసెంబరులో 60 వేల మంది పెరిగారన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:28 AM